మంగళగిరి నుంచి స్కిల్ సెన్సెస్ పైలట్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టుకు మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. మంగళగిరితో పాటు తుళ్లూరులో కూడా పైలట్ ప్రాజెక్టు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Update: 2024-10-01 03:40 GMT

దిశ, మంగళగిరి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరితోపాటు తుళ్లూరు మండలంలో చేపట్టనున్నారు. ఇందుకోసం100 గ్రామ సచివాలయాల పరిధిలో లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించనున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్, శిక్షణ కూడా పూర్తయింది.

లక్ష్యం ఇదే..

ఫీల్డ్ టీమ్స్‌కు సహాయంగా ఉండేందుకు టెక్నికల్ సిబ్బందిని నియమించారు. స్కిల్ డెవలప్ మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది, రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగవకాశాలు కల్పించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది.


Similar News