Tirumala Brahmotsavam: అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వాహనాల పార్కింగ్ కు క్యూఆర్ కోడ్

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Update: 2024-10-01 09:25 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో ఏడు గిరులపై కొలువై ఉన్న కలియుగ దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. తిరుమాఢ వీధులతో పాటు.. తిరుమలలోని మార్గాలలో టీటీడీ విద్యుద్దీపాలంకరణలు చేస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు అన్నప్రసాదం, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 8వ తేదీన గరుడవాహన సేవ జరుగనుండగా.. ఆ రోజున భక్తులు అధిక సంఖ్యలో రానుండగా.. కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అలిపిరి సమీపంలో ఉన్న భారతీయ విద్యాభవన్, నెహ్రూ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానం, వినాయకనగర్ క్వార్టర్స్ తో పాటు ఎస్వీ మెడికల్ కాలేజీ మైదానంలో వాహనాలను పార్క్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

అలాగే టూరిస్టు బస్సుల పార్కింగ్ కు జూ మార్గంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. దేవలోక్ మైదానంలో ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ పార్కింగ్ కు బాలాజీ లింక్ బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఆయా వివరాలను తెలుసుకునేందుకు రుయా, గరుడ కూడలి, బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద క్యూఆర్ కోడ్ లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది టీటీడీ. వాహనదారులు ఆ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తే.. పార్కింగ్ లొకేషన్, మ్యాప్ వస్తుందని, దాని ఆధారంగా వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలు

అక్టోబర్ 3, గురువారం రాత్రి 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

అక్టోబర్4, శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహన సేవ.

అక్టోబర్ 5, శనివారం ఉదయం 8 గంటలకు చిన శేష వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ.

అక్టోబర్ 6, ఆదివారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటలకు ముత్యాల పల్లకీ వాహన సేవ.

అక్టోబర్ 7, సోమవారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 7 గంటల నుంచి స్వభూపాల వాహన సేవ.

అక్టోబర్ 8, మంగళవారం ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ.

అక్టోబర్ 9, బుధవారం ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం, రాత్రి 7 గంటలకు గజవాహన సేవ.

అక్టోబర్ 10, గురువారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ.

అక్టోబర్ 11, శుక్రవారం ఉదయం 6 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు అశ్వ వాహనసేవ.

అక్టోబర్ 12, శనివారం తెల్లవారుజామున 3 గంటలకు పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, ఉదయం 6 గంటల నుంచి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 


Similar News