మద్యం షాపులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఏపీలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-10-01 08:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని అప్లికేషన్లైనా చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.. లేదా డీడీ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్లలో ఇవ్వాలి. ఈ నెల 11న లాటరీ తీసి, లైసెన్సులు ఇస్తారు. 12 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లకు అనుమతినిచ్చారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి రూ. కోటి. వీటికి సంబంధించిన విధివిధానాలు విడిగా ఖరారు చేస్తారు.

మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి. దీన్ని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్ ఉంటుంది." నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్ గా అప్ గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున అదనంగా లైసెన్సు రుసుము చెల్లించాలి.

నూతన మద్యం పాలసీలో మద్యం ధరలు తగ్గించారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. వైసీపీ హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించేవారు. వాటిని నూతన మధ్యం విధానంలో 6 కు కుదించారు. కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం (డ్రగ్ కంట్రోల్ సెస్) విధించారు. ల్యాండెడ్ కాస్ట్ పై 2 శాతం మేర ఈ పన్ను ఉంటుంది. దీని ద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ పై నిర్మూలన చర్యలకు, వ్యసన విముక్తి, కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితరాల కోసం ఈ మొత్తాన్ని కేటాయిస్తారు. సుంకం రూపంలో సమకూరే ఈ ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ట్ర స్థాయిలో త్వరలో ఏర్పాటు చేయబోయే యాంటీ నార్కొటిక్స్ టాస్క్ఫోఫోర్సుకు కేటాయిస్తారు.


Similar News