వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy)పై సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) మృతిపై సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు. గత ముఖ్యమంత్రి మొత్తం దోచుకొని వెళ్లారని తీవ్ర విమర్శలు చేశారు. కొలంబియా స్మగ్లర్ ఎస్కోబార్(Colombian smuggler Escobar)లా మారారని తెలిపారు. ప్రశ్నిస్తే బాబాయ్ వివేకానంద రెడ్డిని పంపినట్లే పంపేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలనేదే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందివ్వలేదని తెలిపారు. విధ్వంస శిథిలాలు తొలగించి ఇటుక ఇటుక పేరుస్తున్నట్లు చెప్పారు.
వైసీపీ మూలంగా రాష్ట్రంలో అధికార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు. ప్రస్తుతం మళ్లీ అధికారులను యాక్టీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ నేతల కబ్జాలు, దౌర్జన్యాలకు భయపడే రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని అన్నారు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసే వారు.. ప్రజలకు నరకం చూపించేవారని గుర్తుచేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4వేలకు పెంచాం. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తాం. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావు. ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పింఛన్లు ఇస్తున్నాం. జీతాల గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారు’ అందరినీ సంతృప్తి పరుస్తూ పాలన కొనసాగిస్తామని అన్నారు.