సజ్జలకు షర్మిల వార్నింగ్: మీకథ మీరు చూసుకోండంటూ హెచ్చరిక
వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా?
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? వైఎస్ షర్మిల వ్యవహారంలో ప్రతీసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు సజ్జల రియాక్ట్ అవ్వడమే ఈ వార్‌కు నాంది పలికిందా? వైసీపీలో అంతమంది ఉండగా సజ్జల మాత్రమే స్పందించడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఏపీలో అటు వైసీపీలోనూ ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ అన్నీ తానై వ్యవహరిస్తున్న సజ్జలకు వైఎస్ షర్మిలకు ఘాటు కౌంటర్ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి? వీరి మధ్య రాజకీయ విబేధాలు ఉన్నాయా? అంటే అవుననే అనుమానం వ్యక్తం అవుతుంది. వైఎస్ఆర్ కుటుంబంలో వచ్చిన విబేధాల వల్లే షర్మిల తెలంగాణకు వెళ్లిపోవడం.. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందనే ప్రచారం ఉంది. ఇదే తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ షర్మిల సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటి నుంచి వైఎస్ షర్మిలకు సజ్జల రామకృష్ణారెడ్డిల మధ్య ఎక్కడో చెడిందనే ప్రచారం రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
మాతో సజ్జలకు పనేంటి?
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ విషయాలకు సజ్జలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో తమతో సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. అప్పటి నుంచి తాము కూడా వారితో సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ మా గురించి మాట్లాడుతున్నారంటే మళ్లీ తమతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమా అని అడిగారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. సింగిల్ రోడ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని..డబుల్ రోడ్ అయితే తెలంగాణ అని.. చీకటి అయితే ఆంధ్రప్రదేశ్ అని..వెలుగు అయితే తెలంగాణ అని కేసీఆర్ చెప్తున్నారని వీటికి ఏం సమాధానం చెప్తారు సజ్జల అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ముందు మీ కథ చూసుకోండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ షర్మిలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైఎస్ షర్మిల సైతం వైసీపీలో ఎవరినీ టార్గెట్ చేయకుండా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిపైనే విమర్శలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మరోసారి సజ్జలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
కాంగ్రెస్‌కు మద్దతివ్వడంపై సజ్జల రియాక్షన్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల మద్దతు ఇవ్వడంపై నాడు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది ఆమె ఇష్టం అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వేధించిందని ఆరోపించారు. ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఆ పార్టీతో షర్మిల కలిశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌పై అనేక అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. తమకు ఏపీ విషయాలే ముఖ్యమని, తెలంగాణ ఎన్నికలతో తమకు సంబంధం లేదని మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిచెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ముందు మీ కథ మీరు చూసుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ పెట్టినప్పటినుంచే అదే సంగతి
ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం జగన్‌కు షర్మిల కొత్త పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటూనే సెటైర్లు వేశారు. వైఎస్ షర్మిల వైసీపీ లైన్ దాటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే షర్మిల పార్టీ పెట్టాలని గత మూడు నెలల నుంచి అనుకుంటున్నారని, కానీ తెలంగాణ పార్టీ పెట్టొద్దని, పార్టీ పెడితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో షర్మిలకు వివరించినా పట్టించుకోలేదన్నారు. పార్టీ పెట్టడం పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని చెప్పుకొచ్చారు.‘తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో తలెత్తే సమస్యలు వస్తాయని చెప్పాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్ససంబంధాలు కొనసాగాలని జగన్ అభిప్రాయం. కాకపోతే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో ఎందుకు జరగకూడదనే షర్మిల అంటున్నారు. ఆమె అభిప్రాయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఒకవేళ షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే ఆ పార్టీకి ప్రత్యేకంగా, పరోక్షంగా మా పార్టీ మద్దతు ఉండదు’అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.