వైసీపీలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి.. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ!
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ నిన్న తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేశారు.
దిశ డైనమిక్ బ్యూరో: సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ నిన్న తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేశారు. ఇక నిన్న ఉదయం ఇంతియాజ్ ఇచ్చిన రాజీనామా లేఖను సాయంత్రానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఇంతియాజ్ వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే వస్తున్న ఆ వార్తలకు తెర దించుతూ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఇంతియాజ్ కు వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
వైసీపీ గూటికి చేరిన ఐఏఎస్ సీనియర్ అధికారి ఇంతియాజ్ రానున్న ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాలతో కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. వ్యక్తిగత సమస్యలు ఏమున్నా అందరినీ కలుపుకొని వెళ్తాను అని పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ అమలు చేస్తున్న నవ రత్నాలు ప్రజలకు మేలు చేశాయని.. కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన అన్నారు.