పిఠాపురంలో భారీ స్కెచ్... భగ్నం చేసిన ఎస్ఈబీ
పిఠాపురంలో జోరుగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది....
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. పత్రాలు సరిగా లేకపోవడంతో పలువురి నామినేషన్లను పెండింగ్ లో పెడుతున్నారు. అన్ని సరిగ్గా ఉంటే నామినేషన్లు ఆమోదిస్తున్నారు.
ఇదిలా ఉంటే పిఠాపురంలో మాత్రం జోరుగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఆయా పార్టీలు జోరుగా ప్రలోభాలకు తెర తీశారు. పిఠాపురంలోని చాలా కాలనీల్లో మద్యం భారీగా నిల్వ చేశారు. మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇళ్లల్లోనే మద్యం డంపులు ఏర్పాటు చేశారు.
Read More...
ఆ నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు.. ప్రభుత్వంపై పవన్ ఆగ్రహం
ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులతో కలిసి ఎస్ఈబీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. జగ్గయ్య చెరువు వైఎస్సార్ గార్డెన్స్‌తో పాటు సాలిపేట, కుమారపురం కాలనీల్లో తనిఖీలు నిర్వహించారు. పలు నివాసాల్లో సోదాలు చేశారు. దీంతో భారీగా మద్యం నిల్వలను గుర్తించారు. రూ. 60 లక్షలకు పైగా విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ ప్రలోభాలకు గురి చేసిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ తెలిపారు. అయితే అధికార పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లల్లో మద్యం నిల్వ చేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌పై గెలవలేకే ప్రలోభాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవడం ఖాయమని అంటున్నారు.