Bhakti: అంబరాన్ని అంటిన సత్యసాయి ఆరాధన ఉత్సవాలు..
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయం సత్యసాయి నామస్మరణతో మార్మోగిపోతోంది.
దిశ ప్రతినిధి పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయం సత్యసాయి నామస్మరణతో మార్మోగిపోతోంది. బాబా 13వ ఆరాధనోత్సవాల్లో భాగంగా పుట్టపర్తికి దేశ విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా సత్యసాయి ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేసింది.
సాయి కుల్వంత్ మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకున్న భక్తజనం, ఆధ్యాత్మిక చింతనలో భక్తిపారవశ్యం పొందారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సత్యసాయి బాబా ఆరాధన ఉత్సవాలలో పాల్గొని బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఆయన సత్యసాయి మహా సమాధి వద్ద పుష్పాలను ఉంచి ఘన నివాళి అర్పించారు.
ఆయనకు ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ సభా మందిరం లో సత్యసాయి రెండు యాప్‌లను గవర్నర్ ప్రారంభించారు. గవర్నర్‌కి ట్రస్ ప్రతినిధులను పరిచయం చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో కేరళ గవర్నర్ మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళికి సత్యసాయి చేసిన సేవలు వెలకట్టలేనివి అన్నారు.
బాబా శివైక్యం పొందినా సత్యసాయి ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవలు కొనసాగిస్తుండడం అభినందనీయమన్నారు. బాబా మహాసమాధిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.