SAAP: స్పోర్ట్స్ కోటా జీఓ సవరణ జరిగేనా..? క్రీడాకారులకు శాపంగా మారిన శాప్

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) రాష్ట్రంలో క్రీడాకారుల, క్రీడా సంఘాల పెద్దన్న.

Update: 2024-08-12 02:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) రాష్ట్రంలో క్రీడాకారుల, క్రీడా సంఘాల పెద్దన్న. అలాంటి శాప్ లో ఉద్యోగులు లేక రాష్ట్రంలో ఉన్న శిక్షకులను శాప్ కార్యాలయంలో స్పోర్ట్స్ ఆఫీసర్ అని పేరు పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ లలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతున్నప్పటికి శాప్ లో మాత్రం ఉద్యోగాల భర్తీ అనే మాట మాత్రం వినిపించదు. శాప్‌లో ఉన్న శిక్షకులు సైతం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వాళ్ళే కావడం గమనార్హం. పర్మినెంట్ ఉద్యోగస్తులు ఎవరు లేక శాప్ కార్యాలయం మొత్తం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తూలతో పరిపాలన కొనసాగిస్తున్నారు. కేవలం పర్మినెంట్ ఉద్యోగస్తులు జూనియర్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వారు కూడా ఎటువంటి సరైన జీ.ఓ లేకుండా కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన వారేనని శాప్ ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. కారుణ్య నియామకాలపై సమగ్ర విచారణ జరిపి శాప్ లో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

జీఓ సవరణ జరిగేనా..

రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ 2022 మార్చి నెలతో ముగిసిన నేటికి స్పోర్ట్స్ పాలసీ అనేది రాష్ట్రంలో లేకపోవడం గమనార్హం. స్పోర్ట్స్ పాలసీ లేకపోవడమే కాకుండా రాష్ట్రంలో క్రీడా సంఘాలకు టోర్నీ నిర్వహణ నిమ్మితం అందించే ఆర్ధిక సహాయం గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిలుపుదల చేశారు. ఐదు సంవత్సరాలుగా క్రీడాకారుల నగదు ప్రోత్సాహకాలు అరకొర అందించడమే తప్ప ఎటువంటి క్రీడాభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు.

క్రీడాభివృద్ధి జరగకపోవడమే కాకుండా అడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేయడం జరిగింది. అడుదాం ఆంధ్రా టోర్నీ వలన అధికారులు, నాయకులు లాభపడ్డారే తప్ప క్రీడాభివృద్ధి జరగలేదని క్రీడాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత సీసాలో కొత్త నీరు లాగా స్పోర్ట్స్ కోటా అమలు సైతం అస్తవ్యస్తంగా ఇష్టానుసారంగా జరుగుతుందని క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. 2019 నుండి రాష్ట్రంలో జాతీయ క్రీడా విధానం 2011 (స్పోర్ట్స్ కోడ్) అమలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోడ్ ప్రకారం శాప్ లో గుర్తింపు పొందిన క్రీడలకు మాత్రమే స్పోర్ట్స్ కోటా వర్తింపజేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా జీ.ఓ ప్రకారం చదువులకు 2008లో వచ్చిన జీ. ఓ.10లో ఉన్న 29 క్రీడలకు, ఉద్యోగాలకు 2012లో వచ్చిన జీ. ఓ.74లో ఉన్న 30 క్రీడలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. అది కూడా శాప్ లో గుర్తింపు ఉన్న క్రీడలకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ రెండు జీ.ఓ ల్లో లేకుండా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన 65 క్రీడలకు శాప్ గుర్తింపు నిస్తుంది కానీ స్పోర్ట్స్ కోటా వర్తించదు. దీనితో శాప్ లో గుర్తింపు ఉన్న స్పోర్ట్స్ కోటా వర్తించక చాలా మంది క్రీడాకారులు నష్టపోతున్నారు. పలుమార్లు క్రీడా సంఘాల ప్రతినిధులు విన్నవించినా నేటికి జీ.ఓ లు సవరణ జరగకపోగా పలు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పోర్ట్స్ పాలసీతో పాటు జీ.ఓ 10, 74లను సవరణ చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.

కోర్టును ఆశ్రయించిన శాప్ కాంట్రాక్టు ట్రైనర్స్

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శిక్షకులు (కోచ్) 1993, 1999 బ్యాచ్ లకు చెందిన 24మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను రెగ్యులర్ చెయ్యాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనలు జరిగినప్పటికీ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. మరో 2009 బ్యాచ్ కు చెందిన మరో 20మంది కాంట్రాక్ట్ శిక్షకులు ఉన్నారు. ఇదిలా ఉంటే శాప్ లో పనిచేసే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు పీఆర్సీ వర్తింపచేసి కాంట్రాక్ట్ శిక్షకులకు నేటికీ పీఆర్సీ ఇవ్వలేదని వారు ఆవేదన చెందుతున్నారు.

నేడు సీఎం చంద్రబాబు సమీక్ష

నేడు జరగనున్న సీఎం సమీక్షకు శాప్ లో ఉద్యోగాల భర్తీ, కేసులు, పీఆర్సీ వర్తింపు, నగదు ప్రోత్సాహకాలు, జీఓల సవరణ వంటివి అజెండాలో పెట్టకుండా సీఎంను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని శాప్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాప్‌లో ఉద్యోగ విరమణ చేసిన వారిని మరల తీసుకునేందుకు ఉద్యోగస్తుల వయస్సు 62కు పెంచాలని, అది కూడా జనవరి 2024 వర్తింపజేయాలని పెట్టడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం శాప్ లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News