Reservoirs are Depleting: సాగునీరు దేవుడెరుగు.. తాగునీటికీ కటకటే..
గతేడాది వర్షాభావం ఇప్పుడు కలవరపెడుతోంది.
దిశ, ప్రతినిధి, కడప: గతేడాది వర్షాభావం ఇప్పుడు కలవరపెడుతోంది. ఈ ఏడాది వర్షాలు త్వరగా పడకపోతే సాగునీరు దేవుడెరుగు.. తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో దండిగా ప్రాజెక్టులు ఉన్నా అవి అడుగంటుతుండడంతో ఆందోళన తప్పడం లేదు. ఒకటి రెండు రిజర్వాయర్లలో కొద్దిగా నీరున్నా మిగతా జలాశయాలు వట్టిపోతున్నాయి.
ప్రధాన ప్రాజెక్టులు అయిన తెలుగుగంగ, గాలేరి-నగరి ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నిర్మించిన బ్రహ్మం సాగర్, గండికోటల నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కి పడిపోవడంతో అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీతో పాటు పలు ప్రాంతాలకు నీటి గండం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. రెండేళ్ళకు ముందు నిండుకుండల్లా జలకళ ఉట్టిపడిన కడప జిల్లాలోని ప్రాజెక్టులు గతేడాది పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఎదురు కావడం, ఈ ఏడాది ఎండలు బాగా పడడంతో రిజర్వాయర్లతో పాటు భూగర్భ నీటిమట్టం పడిపోవడం జిల్లా వాసులను కలవరపెడుతోంది.
రిజర్వాయర్‌లు
ఉమ్మడి కడప జిల్లాలో 82. 258 టీఎంసీల సామర్థ్యంతో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపుగా విభజిత వైఎస్సార్ జిల్లాలోని ఉన్నాయి. రెండేళ్లకు ముందు కళకళ లాడిన ఈ జలాశయాలు ఇప్పుడు అడుగంటి డెడ్ స్టోరేజీకి దగ్గరగా పడ్డాయి. ఈ ప్రాజెక్టులన్నింట్లో కలిపి కూడా 17.4 టీఎంసీలు నీరు మాత్రమే ఉంటే ఇందులో కూడా లీకేజీలు, తాగునీటి అవసరాలు, ఆర్‌టిపిపితోపాటు చిన్న చిన్న పరిశ్రమల కోసం రోజు వెయ్యి క్యూసెక్కుల నీరు బయటకు పోతోంది.
ఈ ఏడాది త్వరగా వర్షాలు కురిసి కృష్ణా జలాలతో శ్రీశైలం నుంచి అక్కడ నుంచి వాటి ఆధారంగా నిర్మించిన కడప రిజర్వాయర్లలోకి నీరు రాకపోతే కడప జిల్లాలో కఠోర కరువు దృశ్యాలు, తాగునీటి కటకటలు కనిపించే ప్రమాదం ఏర్పడుతుంది.
ఏ ప్రాజెక్టు చూసినా..
జిల్లాలో భారీ మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు 14 ఉన్నాయి. వీటిలో తెలుగుగంగ, గాలేరు -నగరి ప్రాజెక్టులు కృష్ణా జలాల ఆధారంగా నిర్మించారు. మరో ప్రాజెక్టు మైలవరంను తుంగభద్ర జలాల ఆధారంగా నిర్మించినా, ఇప్పుడు దానికి కూడా కృష్ణాజిల్లాలే దిక్కయ్యాయి. ఈ ప్రాజెక్టులు అన్నింటికి కూడా కృష్జాజలాలు చేరి నిండుకుండలా కనిపిస్తూ వచ్చాయి.
వీటికి తోడు వర్షాలు భారీగా పడటంతో కావలసినంత నీరు చేరేది. గతేడాది తీవ్ర వర్షాభావం ఏర్పడడం, అంతకుముందు ఏడాదీ వర్షాలు అంతంత మాత్రమే కావడంతో ఈ ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. దీంతో అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం నింపిన నీరు సాగు, తాగునీరు అవసరాలకు పోను ఎండలకు కొంత ఆవిరి రూపంలో తగ్గిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని రిజర్వాయర్‌లు అడుగంటే దశకు చేరుకున్నాయి.