దిశ, ఏపీ బ్యూరో: కడప నగరానికి 5 కి.మీ దూరంలో బ్రిటిష్ కాలం నాటి రిజర్వాయర్ ఒకటి సోమవారం బయటపడింది. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక సమీపంలో బుగ్గ అగ్రహారం వద్ద ఇది వెలుగుచూసింది. పొలాల మధ్యలో రెండు అడుగుల వెడల్పుతో 8 రంధ్రాలతో ఈ రిజర్వాయర్ ఉంది. సుమారు 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో నాలుగు భాగాలుగా విభజించి ఉంది. కడప నగర మంచినీటి అవసరాల కోసం 1890లో బ్రిటీష్ వాళ్లు బుగ్గమల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో దీన్ని నిర్మించినట్లు శిలాఫలకం సైతం ఉంది. కానీ బుగ్గవంక డ్యాం ఏర్పాటుతో దీని అవసరం లేకుండా పోవడంతో మరుగున పడిపోయింది. ఇదిలా ఉంటే, దీన్ని బ్రిటిషర్లు జైలులా వాడేవారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మెుదలయ్యింది.