నారా లోకేశ్‌కు ఊరట: ఈనెల 12 వరకు బెయిల్ పొడిగింపు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మరోసారి ఊరట లభించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మరోసారి ఊరట లభించింది. లోకేశ్ ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు పొడిగించింది. ఈనెల 12 వరకు ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు పొడిగించింది. స్కిల్ స్కాం కేసులో నారా లోకేశ్‌ను విచారించాలని సీఐడీ భావించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అక్టోబర్ 4వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో బుధవారం లోకశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్ ముందస్తు బెయిల్ నేటితో ముగుస్తుందని ఆయన తరఫు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని సీఐడీ తరఫు న్యాయవాది ఏజీ శ్రీరామ్ అన్నారు. ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో అప్పటి వరకు నారా లోకేశ్‌ను అరెస్ట్ చేయోద్దు అంటూ ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఇదే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.