మాజీమంత్రి నారాయణకు ఊరట... ముందస్తు బెయిల్ పొడిగింపు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో మాజీమంత్రి పొంగూరు నారాయణకు ఊరట లభించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో మాజీమంత్రి పొంగూరు నారాయణకు ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు మాజీమంత్రి నారాయణకి ముందస్తు బెయిల్ రెండు వారాలు పొడిగించింది. మాజీమంత్రి పొంగూరు నారాయణ కేసులపై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మాజీమంత్రి నారాయణ ఎదుర్కొంటున్న అన్ని కేసుల విచారణను ఈనెల 16కు హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు రమ్మని సీఐడీ ఆదేశించడంతో మాజీమంత్రి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. 65 ఏళ్లు పైబడిన తనను ప్రత్యక్ష విచారణకు హాజరుకావాలని ఆదేశించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ఇంటివద్దనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‍లో మాజీమంత్రి నారాయణ అభ్యర్థించారు. గతంలో కూడా తనను ఇంటివద్దనే విచారించారని పిటిషన్‍లో నారాయణ ప్రస్తావించారు. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ ను రెండు వారాలకు ఏపీ హైకోర్టు పొడిగించింది. అనంతరం రెండు వారాలపాటు విచారణను వాయిదా వేసింది. ఇకపోతే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో మాజీమంత్రి నారాయణ ఏ2గా సీఐడీ నమోదు చేసింది. ఇటీవలే విచారణకు హాజరుకావాలని నారాయణకు నోటీసులు ఇచ్చింది సీఐడీ. వాట్సాప్ ద్వారా నోటీసులు అందజేసింది. ఈనెల 4న విజయవాడకు విచారణకు హాజరుకావాలని కోరింది. ఈనెల 4న విజయవాడలో నారా లోకేశ్‌తోపాటు మాజీమంత్రి నారాయణను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో నారాయణ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. తాజాగా ఈ ముందస్తు బెయిల్‌ను కోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది.