24 గంటల్లో వాయుగుండం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

Update: 2024-10-15 10:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. తీవ్ర అల్పపీడనంగా మారి.. మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండ్రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అతిభారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రాష్ట్రానికి అతిభారీ వర్షసూచన నేపథ్యంలో.. పరిస్థితులను స్పెషల్ సీఎస్ సిసోడియా విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే పలు ముఖ్య సూచనలు చేశారు. వర్షాలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే కమ్యూనికేషన్ లో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని, అత్యవసరమైతే శాటిలైట్ ఫోన్లను వాడేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. 


Similar News