Minister Narayana:వైసీపీ పాలనలో రియల్ ఎస్టేట్ పూర్తిగా నాశనమైంది!
ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ(YSRCP) పాలనలో రియల్ ఎస్టేట్ పూర్తిగా నాశనం అయిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) విమర్శించారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ(YSRCP) పాలనలో రియల్ ఎస్టేట్ పూర్తిగా నాశనం అయిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) విమర్శించారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) విజయవాడలో క్రెడాయ్ ప్రాపర్టీ షో (CREDAI, Property Show)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రియల్ ఎస్టేట్ రంగం పెరుగుదల పై దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారులు పర్యటన తర్వాత మెరుగైన విధానాలను అమల్లోకి తీసుకొచ్చాం అన్నారు. లే అవుట్ లలో రోడ్లకు అనుమతులను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించామని పేర్కొన్నారు.
గేటెడ్ కమ్యూనిటీ లకు గ్రూప్ డెవలప్మెంట్ నిబంధనల్ని వర్తింప చేస్తున్నాం. రైల్వే ట్రాక్‌ను ఆనుకుని ఉన్న చోట చేసే నిర్మాణాలకు NOC అవసరం లేకుండా మార్పు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ క్రమంలో 500 చ.మీ పైబడిన నిర్మాణాలకు కూడా సెల్లార్ లకు అనుమతులు ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. 30 మీ.ఎత్తు దాటిన భవనాలకు ఎన్విరాన్మెంటల్ డెక్‌ను అనుమతిస్తున్నం. 5 అంతస్తుల లోపు నిర్మాణాలకు ఎలాంటి అనుమతి అవసరం లేకుండా జీవో తీసుకొస్తున్నామని తెలిపారు. వ్యవసాయ భూములలో కూడా పౌల్ట్రీ ఫామ్స్ నెలకొల్పుకునేలా మార్పులు చేస్తున్నామని, భవన, లే అవుట్ ల అనుమతులు కొరకు ఇంటెగ్రేషన్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. దేశంలోనే మొదటిసారి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకు వస్తున్నాము మంత్రి నారాయణ పేర్కొన్నారు.