రేషన్ డీలర్ మనీషా అదృశ్యం.. కేసులో సంచలన ట్విస్ట్

పల్నాడు జిల్లాలో కలకలం రేపిన రేషన్ డీలర్ మనీషా అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ..

Update: 2024-08-28 13:00 GMT

దిశ పల్నాడు: పల్నాడు జిల్లాలో కలకలం రేపిన రేషన్ డీలర్ మనీషా అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఆత్మహత్య చేసుకుంటున్నంటూ మనీషా ఆడిన డ్రామాకి పోలీసులు చెక్ పెట్టారు. నర్సరావుపేటలో బంధువుల ఇంటి వద్ద మనీషా ఆచూకీని పోలీసులు గుర్తించారు. దీంతో రెండు రోజులుగా మనీషా చుట్టు రాజుకున్న పోలిటికల్ హీట్‌కు తెరపడింది.

పిడుగురాళ్ల మండలం జులకల్లు చెందిన మనీషా రేషన్ డీలర్‌గా పని చేస్తు్న్నారు. రేషన్ షాపు విషయంలో తనను టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకుంటున్నానని మనీషా మంగళవారం ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. సాగర్ కెనాల్ వద్ద మనీషా చెప్పులు చున్ని కనిపించటంతో అంతా ఆమె సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకునట్లుగా భావించారు.

ఈ ఘటనపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. టీడీపీ నాయకుల వేధింపులతో దళిత యువతి ఆత్మహత్యకు పాల్పడిందని ఓ వీడియోను రీలీజ్ చేశారు. దీంతో ఒక్కసారి ఈ అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. పోలీసులు హుటాహుటిన దర్యాప్తు చేపట్టారు. విచారణలో మనీషా నర్సరావుపేట బంధువుల ఇంటి దగ్గర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కావాలనే మనీషాను ఆత్మహత్య నాటకం ఆడించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే సాగర్ కెనాల్ వద్ద మనీషా చెప్పులు, చున్ని వదిలి వెళ్లినట్లుగా విచారణలో తేలడంతో పొలిటికల్ హై టెన్షన్‌కు పుల్ స్టాప్ పడింది. మనీషా బతికే ఉందని తెలియటంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News