16న తిరుమలలో ర‌థ‌స‌ప్తమి వేడుకలు.. ఘనంగా ఏర్పాట్లు చేస్తోన్న టీటీడీ

పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి ని ‘రథ సప్తమి లేదా మాఘ సప్తమి’ అని పిలుస్తారు.

Update: 2024-02-13 11:55 GMT

దిశ, తిరుమల :పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి ని ‘రథ సప్తమి లేదా మాఘ సప్తమి’ అని పిలుస్తారు.ఈ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదిస్తాడనీ వేదాల ద్వారా తెలుస్తోంది. సూర్య జయంతి సందర్భంగా ఈనెల 16వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఆ ఒక్క రోజే ఏడు వాహనాలపై స్వామి వారి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే తిరుమల ఆలయం లోపల, ఆలయ నాలుగు మాడా వీధులలో టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారు ఏడు వాహనాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ వాహన సేవలు తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులు తిలకించడానికి షెడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రథ‌సప్తమి ప‌ర్వదినాన్ని పుర‌స్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది.

ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. ఇదిలా ఉండగా ర‌థ‌సప్తమి పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.

- ఆరోజు వాహన సేవల వివరాలు :

తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.40 గంట‌ల‌కు) - సూర్యప్రభ వాహనం

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం

ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు - గరుడ వాహనం

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం


 




Similar News