రతన్ టాటా మనల్ని ప్రతి రోజు చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారు: మంత్రి నారా లోకేష్
భారత ప్రముఖ వ్యాపార వెత్తి రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రముఖ వ్యాపార వెత్తి రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. కాగా ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరి సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రతన్ టాటా మృతి పట్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రి తన ట్వీట్‌లో "విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా గారు. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయం. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరు. మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళం తో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటా ది. నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటా గారికి మరణం లేదు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారు.. రతన్ టాటా గారి నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నాను." అని మంత్రి నారా లోకేష్ రాసుకొచ్చారు. కాగా ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రతన్ టాటా మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ముంబై బయలు దేరాడు.