కాంగ్రెస్‌లో చేరిన సినీనటుడు రాజా

సినీ నటుడు, ఆధ్యాత్మిక బోధకుడు రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2023-09-20 09:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సినీ నటుడు, ఆధ్యాత్మిక బోధకుడు రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో బుధవారం పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గిడుగు రుద్రరాజు పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీకి అభిమానిని అని చెప్పుకొచ్చారు. రాజకీయం తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చారు. అయితే ఒకప్పుడు సినిమాలతో..ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంతో బిజీబిజీగా గడిపినట్లు తెలిపారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్లు తెలిపారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కోసం శ్రమిస్తానని నటుడు రాజా తెలిపారు. మణిపూర్ అల్లర్ల ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన అభినందనీయమన్నారు. దేశంలో ఎవ్వరూ కూడా సాహసించని విధంగా రాహుల్ గాంధీ స్పందించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చారు. అదే స్పూర్తితో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నటడు రాజా వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆలోచనా విధానం తనకు ఎంతో నచ్చుతుందన్నారు. సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం విషయంలో విజన్ ఉన్న నాయకుడు రాహుల్ అని రాజా కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తనకు అవకాశం ‎ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తో పాటు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు రాజా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు.

రాజా సేవలను వినియోగించుకుంటాం : గిడుగు రుద్రరాజు

నటుడు రాజా కాంగ్రెస్‌లో చేరికపై పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు రాజా లాంటి వ్యక్తుల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశాలతో రాజాను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకుంటామని...అలాగే వైఎస్ షర్మిల వచ్చినా పార్టీ సేవలకు వినియోగించుకుంటామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బుర్రా కిరణ్, ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ శివాజీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు

Tags:    

Similar News