ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సర్వే లీక్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే స్థానాలివేనా?

సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో రాయలసీమతో పాటు మరి కొన్ని జిల్లాల్లో క్లీన్ స్విప్ చేసిన వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Update: 2023-08-21 05:58 GMT

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపు గుర్రాల కోసం వైసీపీ సర్వే చేపట్టింది. అందులో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఐప్యాక్ సర్వే లీక్ కావడంతో ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాష్ర్టవ్యాప్తంగా అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేతల సభలు, యాత్రలకు జనాలు భారీగా తరలి వస్తున్నారు. సీఎం జగన్ సహా చాలా మంది నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేకపోతున్నారు. జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలతో పాటు అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్న సభలు జనాల్లేక వెలవెలబోతున్నాయి. వచ్చిన వారిలో పలువురు జగన్ ప్రసంగం ప్రారంభించగానే వెనుతిరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని పేర్కొంటున్నాయి.

దిశ, కర్నూలు ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో రాయలసీమతో పాటు మరి కొన్ని జిల్లాల్లో క్లీన్ స్విప్ చేసిన వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకు అనేక కారణాలున్నాయంటూ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దీన్ని పసిగట్టిన వైసీపీ గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు పలు రకాల సంస్థలతో సర్వేలు చేయిస్తోంది. అందులో భాగంగా ప్రశాంత్ కిశోర్ బృందం చేపట్టిన ఐప్యాక్ సర్వే లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక..

ఐ ప్యాక్ సర్వే తొలి విడత ఫలితాల ఆధారంగా.. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ గతంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సర్వేల పూర్తిస్థాయి ఫలితాలు త్వరలోనే జగన్ చేతికి అందనున్నాయని, ఆ ఫలితాల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో టైమ్స్ నౌ సర్వే ఒకటి బహిర్గతమైంది. ఆ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉండడంతో వైసీపీ నాయకులే దాన్ని నమ్మడం లేదు. కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోవడం లేదు. తాజాగా ఐ ప్యాక్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన చార్టును చూస్తే... వైసీపీ విజయావకాశాలు తగ్గిపోతున్నాయని తేల్చేసినట్లే కనిపిస్తోంది. కేవలం ఎంపీల పనితీరుపై ఐప్యాక్ ఈ రిపోర్టు ఇచ్చినట్లు కనిపిస్తోంది.

గడపగడపకూ వెళ్తున్నా..

గత ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు గానూ 22 స్థానాలు దక్కించుకుంది. అందులో ఐదారుగురు ఈసారి లోక్ సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం సాగుతోంది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్తున్నా ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక సతమతమౌతున్నారు.

గెలవని ఎంపీ స్థానాలు ఎక్కడంటే ?

గత ఎన్నికల్లో గెలిచిన 22 మంది వైసీపీ ఎంపీల్లో 16 మంది ఎంపీలు వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచినా గెలిచే అవకాశాల్లేవని ఐ ప్యాక్ సర్వే చెబుతోంది. కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి స్థానాల్లో పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది. కడప, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే వైసీపీకి ఒకింత మొగ్గు ఉంది. వైసీపీ గెలుస్తుందని భావించిన మూడు స్థానాల్లో 4 శాతం లీడ్ కన్పిస్తుండగా, పోటాపోటీ ఉంటుందని భావిస్తున్న స్థానాల్లో అధిక శాతం టీడీపీ వశమయ్యే అవకాశాలున్నట్లు సర్వేలో పేర్కొనడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం స్థానాల్లోనూ వైసీపీకి విజయావకాశాలు లేవని సర్వే తెలిపింది.

పవన్ ఎఫెక్ట్ ఎంతంటే...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయా స్థానాల్లో 10 నుంచి 15 శాతం ఓట్లను తమ వైపునకు తిప్పుకునే అవకాశం ఉందని సర్వేలు బహిర్గతం చేస్తున్నాయి. ఇక టీడీపీ విషయానికొస్తే దాదాపు 25 పార్లమెంట్ స్థానాల్లో 40 నుంచి 53 శాతం ఓటింగ్ దక్కించుకోనున్నట్లు పేర్కొనగా 45 శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి స్థానంలో విజయకేతనం ఎగరేసే అవకాశం ఉందని సర్వేలో తెలిపారు. ఈ లెక్కన, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 35 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.

Read More : తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే: ఎంపీ బండి సంజయ్ ఫైర్ 

Read More : వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు..తొలిజాబితా ఎప్పుడంటే

Tags:    

Similar News