మెకానిక్ అవతారమెత్తిన లోకేశ్.. అధికారంలోకి రాగానే వాళ్లను ఆదుకుంటామంటూ హామీ
ఇటీవల హర్యానాలో రాహుల్ గాంధీ బైక్ రిపేరులో మెకానిక్ లతో చేయి కలిపారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో బైక్ మెకానిక్ అయ్యారు.
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల హర్యానాలో రాహుల్ గాంధీ బైక్ రిపేరులో మెకానిక్ లతో చేయి కలిపారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో బైక్ మెకానిక్ అయ్యారు. మంగళవారం యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ మెకానిక్ లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈసందర్భంగా వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రతీ ఏటా కొత్త కొత్త బైకులొస్తున్నాయి. బీఎస్4 ఇంజన్ల దాకా రిపేరు చేయడం మాకొచ్చు. ఇప్పుడు బీఎస్5, 6 ఇంజన్లు వస్తున్నాయి. వాటిని ఎలా రిపేరు చేయాలో అర్థం కావడం లేదని మెకానిక్ లు వాపోయారు. కొత్తవి మార్కెట్లోకి వచ్చినప్పుడు మెకానిక్‌లకు తగు శిక్షణ ఇస్తే బావుంటుందని చెప్పారు. అలాగే షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఇలా చిన్నచిన్న షెడ్లు పెట్టుకొని జీవిస్తున్నట్లు లోకేష్ కు వివరించారు. బైక్ మెకానిక్‌లకు కూడా ఓ సొసైటీ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
మెకానిక్‌ల సమస్యలపై లోకేష్ స్పందిస్తూ వీళ్లు కూడా జగన్ బాధితులేనని వ్యాఖ్యానించారు. జగన్ అసమర్థ పాలన, కొవిడ్ దెబ్బకు బైక్‌ల అమ్మకాలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా మరో కారణమని లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంటు నియోజవర్గం ప్రామాణికంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. షెడ్ల ఏర్పాటునకు సబ్సిడీతో రుణాలు ఇప్పిస్తాం. గుర్తింపు కార్డులు ఇచ్చి చంద్రన్న బీమా అమలు చేస్తాం. మెకానిక్‌ల ఆదాయం పెంచి ఆదుకునేందుకు భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని మెకానిక్‌లకు లోకేష్ హామీనిచ్చారు.
చిన్నప్పుడు కాలేజీ ఎగ్గొట్టి బైక్ పై సినిమాకు చెక్కేశా .. లోకేష్
చిన్నప్పుడు మీ మాదిరిగానే కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లి ఇంట్లో దొరికి పోయా. అమ్మతో దెబ్బలు తిన్నా. అప్పుడు అదో సరదా. నాకు ఓ మెకానిక్ ఫ్రెండున్నాడు. బైక్ ఇంజను తీసుకెళ్లి ఓ కారు తయారు చేశా. మేమిద్దరం అందులో తిరిగే వాళ్లం. ఇప్పటికీ ఆ కారును పదిలంగా దాచుకున్నా.