YSRCP:వైసీపీకి మరో బిగ్ షాక్..పార్టీకి రాజీనామా చేసిన మేయర్ దంపతులు

ఏలూరులో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పక్షం రోజులు కూడా కాకుండానే వైసీపీకి ఏలూరులో మరో దెబ్బ తగిలింది.

Update: 2024-08-27 02:11 GMT

దిశ,ఏలూరు:ఏలూరులో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పక్షం రోజులు కూడా కాకుండానే వైసీపీకి ఏలూరులో మరో దెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్ ప్రకటించారు. ఆమెతో పాటుగా ఆమె భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ దంపతులు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించినప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అనుయాయులు చెబుతున్నారు. రాజీనామాను వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి మేయర్‌ పంపించారు. అయితే తన పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు. భార్యాభర్తలు ఇరువురు అమరావతిలో మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఈ నెల నేడు టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు.

టీడీపీలోనే రాజకీయ ప్రస్థానం..

వాస్తవానికి మేయర్ నూర్జహాన్, పెదబాబు‌ దంపతుల రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలోనే మొదలైంది. 2013లో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బడేటి బుజ్జి నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో ఎస్‌ఎంఆర్‌ పెదబాబును పార్టీలో చేర్చుకుని ఆయన సతీమణి నూర్జహాన్‌ను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె గెలిచి ఏలూరు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. మేయర్ దంపతులు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. మరోసారి నూర్జహాన్‌కు మేయర్ పదవి దక్కింది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో రావాలని నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీలోకి 30 మంది కార్పొరేటర్లు?

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు 30 మంది కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కార్పొరేటర్లు మేయర్ నూర్జహాన్‌ దంపతులతో కలిసి వెళ్లి చేరుతారా.. ఆ తర్వాత అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే చంటితో సంప్రదింపులు జరిపారు. ఇక టీడీపీలో చేరడం లాంఛనమే అంటున్నారు. వైసీపీ గెలుచుకున్న ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇప్పుడు మొత్తం వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరితే టీడీపీ నాయకత్వం లోకి వెళ్తుంది. గతంలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు మేయర్‌ నూర్జహాన్‌ వైఖరిపై అసంతృప్తి చెంది అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు యత్నించారు. అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని వారించడంతో ఆగిపోయారు. ఇప్పుడు మేయర్‌ దంపతులు టీడీపీకి వెళ్తే అంతకుముందు వ్యతిరేకించిన కార్పొరేటర్లు ఈ ఇద్దరికి సహకరిస్తారా లేదా అనే అనుమానాలున్నాయి.


Similar News