చంపేస్తామని బెదిరింపులు.. తెలుగు రాష్ట్రాల సీఎంలపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలపై కేసు వేశానని తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

Update: 2024-10-18 09:30 GMT

దిశ, వెబ్ డెస్క్: తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని, 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలపై కేసు పెట్టానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul). తాను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని ఒక కీలక నేత బెదిరిస్తున్నారని, ఇప్పటి వరకూ తనను బెదిరించిన వాళ్లే పోయారే తప్ప తనకేమీ కాలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలని వచ్చిన తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానన్న పాల్.. ఇకపై తనకు దేవుడే సెక్యూరిటీ అన్నారు. తనపై కుట్ర పన్నిన వారు కలలో కూడా బాగుపడరని శపించారు. చంపాలని కుట్ర చేస్తున్నవారు కచ్చితంగా చనిపోతారని జోస్యం చెప్పారు.

గ్రూప్-1 విద్యార్థుల డిమాండ్ ను కేఏ పాల్ సమర్థించారు. పరీక్షల వాయిదాపై సుప్రీంకోర్టుకెక్కిన వాళ్లకు.. నెల, రెండు నెలలు సమయం ఇస్తే తప్పేంటని తెలంగాణ సర్కారును ప్రశ్నించారు. హర్యానాలో కాంగ్రెస్ 7 హామీలిచ్చినా ప్రజలు నమ్మలేదని, అందుకే ఓడిపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల ముందిచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డితో ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. ఆయన సౌత్ కొరియాకు వెళ్లి కూడా టూరిస్ట్ గా తిరిగివచ్చాడే తప్ప.. రాష్ట్రానికి ఏ మేలు చేయలేదన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా కేఏ పాల్ విమర్శలు చేశారు. బాబు రావాలి.. జాబు రావాలి అన్నప్పుడే బాబు వస్తే ఏదీ జరగదని తాను చెప్పానన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీనే జరగలేదని తేలాక.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తనను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడని పవన్ అంటారు కానీ.. ఏ విషయంలోనూ ఆయన తగ్గడన్నారు. ఆంధ్రాలో మంత్రులు, మాజీ మంత్రులు లిక్కర్ వ్యాపారంలో వాటాలు అడుగుతున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రపంచంలో డబ్బు ఎక్కువైతే మనకు దరిద్రం ఎక్కువైందన్నారు. ఏపీలో జరుగుతున్న డ్రగ్స్ ప్రొడక్షన్.. దేశమంతా సప్లై అవుతుందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేసేవారిని జీవితకాలం సస్పెండ్ చేయాలన్నారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ ముద్దు అని సుప్రీంకోర్టులో పిల్ వేస్తున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. 


Similar News