ఇది మహాత్యమా...సైన్స్ నా..? కాలువ బుగ్గ రామేశ్వరం ఆలయ కోనేరు అద్భుతం

ఇది మహాత్యమో లేక సైన్స్ ఏమోగాని ఓ దేవాలయం కోనేరు నీటిలో వరద నీటి ప్రవాహం కలవకపోవడం మాత్రం ఓ అద్భుత ఘట్టంగా నిలిచింది

Update: 2024-10-18 11:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇది మహాత్యమో లేక సైన్స్ ఏమోగాని ఓ దేవాలయం కోనేరు నీటిలో వరద నీటి ప్రవాహం కలవకపోవడం మాత్రం ఓ అద్భుత ఘట్టంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా కాలువ బుగ్గ రామేశ్వరం దేవాలయం ఆవరణలో ఉన్న కోనేరు ఈ అద్భుత దృశ్యానికి వేదికైంది. ఆ ప్రాంతంలో కురుస్తున్నా, భారీ వర్షాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తు కోనేరు నీటిని తాకుతూ ముందుకు దూసుకెలుతోంది. అయితే పూర్తిగా నీటితో నిండి ఉన్న కోనేరు ఆ వరద నీటిని మాత్రం తనలో కలవనివ్వడం లేదు. కోనేరు నీటిని తాకుతూ దిగువకు వేగంగా ప్రవహిస్తున్న వరద నీరు కోనేరులోకి వెళ్ళలేకపోతుండటం వెనుక మతలబు ఏమిటన్నది మిస్టరీగా మారింది. కోనేరు నీటి రంగు..వరద నీటి రంగు దేనికదే వేర్వేరుగా కనిపిస్తు అబ్బురపరుస్తుంది. ఇది సైన్స్ అనుకునే వారికి సైన్స్ గా..దేవుడి లీల అనుకునే వారికి దేవుడి మహత్తుగా భావించవచ్చంటున్నారు స్థానికులు. మన పురాతన దేవాలయాల నిర్మాణంలో నాటి ఋషుల తపశ్శక్తి దారపోయడమే ఇటువంటి విశిష్టతలకు మూలం అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

అయితే బుగ్గరామేశ్వరుడిని పరశురాముడు ప్రతిష్ఠించినట్లుగా పురాణ కథనం. ఇక్కడ కోనేరు సహజ సిద్దంగా భూమి నుండి ఉబికి వచ్చిన నీటి ఊట 'బుగ్గ' వలన ఏర్పడి నీరు కాలువలా ప్రవహించటం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చింది. ఇక్కడి కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది. శివలింగం శిరస్సు నుండి పైకి ఉబికి వచ్చే నీరు నిర్మలంగా ఉండి రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలికి ప్రవహించడం విశేషం. గర్బగుడిలో శ్రీ స్వామివారి పై నీటి బిందువులు పడతాయని చెపుతారు. కోనేటిలో అన్నికాలాల్లోను శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుందట. కాని కోనేటి లోని నీటి మట్టం మాత్రం పెరక్కుండా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇదే విధానం మహానందిలోను, యాగంటి లోను కూడా మనం చూడవచ్చంటున్నారు చరిత్రకారులు.


Similar News