AP News: 30 పార్టీలొచ్చినా తగ్గేదే లే : పేర్ని నాని
వైసీపీ కార్యకర్తల్ని ఎంత బెదిరించినా పార్టీ జెండా మోయకుండా ఆపలేరన్నారు పేర్నినాని.
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ (YSRCP) ఆధారం, మూలం, బలం కార్యకర్తలేనని చెప్పారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పేర్ని నాని (Perni Nani) హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 3 పార్టీలు కాదు.. 30 పార్టీలొచ్చినా.. పోటీకి తగ్గేదే లే అన్నారు. ప్రధాని మోదీ (Modi), సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారమదంతో వైసీపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని, ఓవర్ యాక్షన్ చేసినవారిని వదిలిపెట్టబోమన్నారు. వైసీపీ జెండా మోసిన కార్యకర్తలు దర్జాగా బ్రతుకుతుంటే.. జనసేన కార్యకర్తలు మాత్రం మానసిక క్షోభను అనుభవిస్తున్నారని, ఇంత జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు, కార్యకర్తల్ని వేధిస్తున్నారని దుయ్యబట్టారు పేర్నినాని. తమకు వేధించిన వారికి 10 రెట్లు తిరిగిస్తామన్నారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని, వారిని ఎవరెంత కొట్టినా, తిట్టినా జెండాను వదలరని, అది తమ పార్టీ కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి అని పేర్కొన్నారు. జగన్ తల్లి, చెల్లెలి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు తమ చెల్లెళ్లకు ఎంత ఆస్తి రాసిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబుకి (Chandrababu) ఎంతమంది చెల్లెళ్లున్నారో ఎవరికీ తెలీదన్నారు. పవన్ బ్యాచ్ తమకున్న సీట్లు చూసి మాట్లాడుతున్నారు కానీ.. జగన్ (Jagan)కు అధికారం లేకపోయినా ఒక రాజకీయనేతగా ఆయన్ను ప్రేమించేవారున్నారన్నారు.