పెడన పర్యటన ఎఫెక్ట్: పవన్ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు ఇచ్చారు.

Update: 2023-10-04 07:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో దాడులకు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వాలని నోటీసులో ఎస్పీ కోరారు. ఈ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బందరు డీఎస్పీ రూరల్ సీఐ ద్వారా నోటీసులు జారీ చేశారు. బాధ్యత గల వ్యక్తులు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి అని జిల్లా ఎస్పీ జాషువా సూచించారు. పెడన, మచిలీపట్నంలలో పవన్ కల్యాణ్ శాంతి భద్రత అంశాలపై లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని లేకపోతే చర్యలు ఉంటాయని నోటీసుల్లో హెచ్చరించారు. ఇకపోతే పెడనలో బుధవారం జరిగే వారాహి విజయయాత్రలో దాడులు, గొడవలు సృష్టించే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో జనసైనికులు, టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ దాడులకు పాల్పడితే ప్రతిదాడులకు పాల్పడకుండా పోలీసులకు వారిని అప్పగించాలని సూచించారు. ఈ దాడులకు సంబంధించి తనకు విశ్వసనీయ సమాచారం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. పవన కల్యాణ్ ఆరోపణలపై ఎస్పీ జాషువా స్పందించారు. దాడులకు సంబంధించి సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని కోరారు. అంతేగానీ అసత్యపూరిత ప్రచారం చేస్తే అది సరికాదని అన్నారు. పెడనలో పవన్ కల్యాణ్ సభకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జాషువా వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ఆరోపణలు ఇవే!

జనసేన పార్టీ చేపట్టిన వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోంది అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అల్లరి మూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని , కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లు తన దగ్గర సమాచారం ఉందని అన్నారు. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజయయాత్ర సభలో రౌడీమూకలు , గూండాలు , అల్లరి మూకలను దించి సభపై రాళ్ల దాడి చేయించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన జనవాణి - జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు.‘వైసీపీ నాయకుడికి , డీజీపీకి , హోం మంత్రికి , పోలీస్ అధికారులకు స్పష్టంగా చెబుతున్నా .. పెడన సభలో కనుక ఏవైనా గొడవలు పెట్టుకోవాలని చూస్తే ఏ మాత్రం సహించేది లేదు’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఏం జరిగినా వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Tags:    

Similar News