Breaking: పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై పవన్ కీలక వ్యాఖ్యలు
పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని జనసేన అధినేత పవన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసింది. అయితే ఈ పొత్తులపై ఆదివారం కీలక అడుగులు పడ్డాయి. ఎన్నికల్లో పోటీలో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఆదివారం మధ్యాహ్నం ఇదరు అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సందర్భంగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో కొంచెం ఇబ్బందులున్నాయని, సీట్ల సర్దుబాటు కొందరిని నిరాశకు గురికావాల్సి వస్తుందని చెప్పారు. గతంలో సీపీఐ, సీపీఎం పరిస్థితులు కూడా ఇలాగే ఉండేవని గుర్తు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆ రెండు పార్టీలకు కూడా బాధలు తప్పలేదన్నారు. ప్రస్తుతం టీడీపీతో పొత్తు, సీట్ల విషయంలో కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో 98 శాతం గెలుపు అవకాశాలున్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
కాగా సీఎం జగన్ ఏలూరు సభలో చేసిన అర్జునుడి వ్యాఖ్యలపైనా పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ మహాభారతంలో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారని.. తమల్ని కౌరవులతో పోల్చుతున్నారని.. కానీ ఇది కలియుగం కౌరవులు, పాండవులతో పోల్చుకోవద్దని సూచిచారు. సొంత చెల్లెలు షర్మిల గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని.. అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకోవడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.
సొంత చెల్లిలికి గౌరవం ఇవ్వని వ్యక్తి.. ప్రజలకు గౌరవం ఇస్తాడా అని ప్రశ్నించారు. జగన్ మాట్లాడితే సిద్ధం.. సిద్ధం అంటున్నారని.. ఎన్నికలకు తాము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. సీఎం జగన్ అన్నింటికీ బదులు చెల్లించాల్సిన టైమ్ వస్తుందని పవన్ హెచ్చరించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తునమనేది కాదని.. గెలిచే సీట్లలో పోటీ చేయాలని చెప్పారు. ఈ సారి బలంగా అసెంబ్లీలోకి అడుగు పెడతామని. ఈసారి రాష్ట్రంలో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.