ఎన్డీయేకు పవన్ కల్యాణ్ గుడ్‌బై..! త్వరలోనే ప్రకటన

రానున్న ఎన్నికలు జనసేన పార్టీకి చాలా కీలకం. చావో రేవో

Update: 2023-10-05 01:51 GMT

రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాబోయేది టీడీపీ–జనసేన సంకీర్ణ ప్రభుత్వమేనని మొన్నటి అవనిగడ్డ సభలో పవన్​ క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో పొత్తు ప్రకటన సందర్భంగా బీజేపీ కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. సీఎం జగన్​పై అవ్యాజమైన ప్రేమను ఢిల్లీ బాద్​ షాలు ఇంకా కొనసాగిస్తున్నారని జనసేనానికి అర్థమైనట్లుంది. చంద్రబాబు అరెస్టుపై బీజేపీ పెద్దలు స్పందించకపోవడంతో ఆయన​ నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ లేకుంటే వామపక్షాలు కలిసొచ్చే అవకాశాలున్నాయి. బీజేపీతో కలిస్తే నష్టమేనని సర్వేలన్నీ తేల్చిచెబుతున్నాయి. అందుకే​ కమలనాథులను వదిలించుకోవడానికే పవన్ సిద్దమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: రానున్న ఎన్నికలు జనసేన పార్టీకి చాలా కీలకం. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అసెంబ్లీలో అడుగు పెట్టడంతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుంటే నిలదొక్కుకోవడం కష్టం. పార్టీపై ఎన్నో ఆకాంక్షలతో వచ్చిన నాయకులు, కార్యకర్తలను నిలుపుకోవాలంటే అనివార్యంగా శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలి. బీజేపీ ఎత్తుగడలను నమ్ముకుంటే జనసేన ఉనికికే ప్రమాదమని పవన్‌కు బోధపడినట్లుంది. ఇదే విషయం పార్టీ విస్తృత సమావేశంలోనూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేనతో పాటు వామపక్షాలు కలిస్తే తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించవచ్చని శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలి వీస్తున్న సమయంలో ఆ పార్టీని వదిలించుకోవడమే మేలు అని సేనాని సంకేతాలు ఇస్తున్నట్లుంది.

ఇరుకునపడిన బీజేపీ పెద్దలు..

చంద్రబాబు మాత్రం ఇప్పటికీ బీజేపీ పట్ల తన వైఖరి ఏంటనేది స్పష్టం చేయలేదు. టీడీపీ నేతల నుంచి క్షేత్ర స్థాయి కార్యకర్తల దాకా కాషాయ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్‌ను వెనుక నుంచి నడిపిస్తోంది బీజేపీ పెద్దలేనని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. బాబు రిమాండ్​పై కనీసం నోరు మెదపకపోవడంపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిన్నమొన్నటిదాకా అటు జగన్​.. ఇటు చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం దోబూచులాడింది. ఎన్నికలు దగ్గర పడే సమయానికి టీడీపీని దెబ్బతీసి ఆ స్థానాన్ని ఆక్రమించాలనే వ్యూహానికి తెరతీసింది. ముఖ్యమైన నాయకులందర్నీ ఏవో కేసుల పేరుతో జైల్లో పెట్టడం ద్వారా జగన్​ విజయానికి దోహదపడాలని భావించింది. చంద్రబాబుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరగడం.. పవన్​ కల్యాణ్​ పొత్తు ప్రకటించడంతో బీజేపీ పెద్దలు ఇరుకున పడ్డారు.

బాబుపై తమ్ముళ్ల నమ్మకం..

ఇప్పుడు పార్టీ యంత్రాంగం అభిమతాన్ని కాదని చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవచ్చని తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. ఇండియా కూటమికి దగ్గరయ్యే అంశంపై బాబు జైలు నుంచి బయటకు వచ్చాక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ నుంచి బీజేపీ, వైసీపీ ఎలా ముందుకెళ్తాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం జగన్​ 6,7 తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మోడీ, అమిత్​ షాలతో చర్చించే అవకాశముంది.

తర్వాతి టార్గెట్ ఆయనే..?

పెడన వారాహి సభలో పవన్​ తనపై రెండు వేల మంది రాళ్ల దాడికి కుట్ర పన్నినట్లు వ్యాఖ్యానించారు. దీనిపై ఆధారాలు ఇవ్వకుంటే తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కృష్ణా జిల్లా ఎస్సీ నోటీసులు జారీ చేశారు. దీన్నిబట్టి ఇక్కడ నుంచి పవన్​ను కూడా కేసులతో టార్గెట్ చేయడానికి వైసీపీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జైలు నుంచి చంద్రబాబు, ఢిల్లీ పర్యటన నుంచి జగన్ వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News