నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేయనున్నట్లు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల విభాగంలోని మెడికల్ కాలేజీల్లోని 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6న విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అధికారులు సూచించారు. బ్రాడ్ స్పెషాలిటీల్లోని 255 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. మరిన్ని వివరాలకు https://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని బోర్డు మెంబర్ సెక్రెటరీ ఎం. శ్రీనివాసులు పేర్కొన్నారు.