చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు లేవు: అచ్చెన్నాయుడు

సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బ్లూ మీడియా వక్రీకరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Update: 2023-11-28 12:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బ్లూ మీడియా వక్రీకరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న సీఐడి వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టాలన్న సీఐడీ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ నీలి మీడియా పలు అంశాలను వక్రీకరించి స్క్రోలింగ్‌ ఇచ్చింది అని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ప్రజా కార్యక్రమాలపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదు అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంచి చేసి వుంటే జగన్‌రెడ్డి ఎందుకు చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు? అబద్ధపు ప్రచారాలు నీలి మీడియాలో ఎందుకు చేస్తున్నారు? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


చంద్రబాబును అడ్డుకునే కుట్ర

టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్స్‌లో పాల్గొనరాదని సుప్రీంకోర్టు చెప్పినట్టు నీలి మీడియాలో అబద్ధపు స్క్రోలింగ్స్‌ ఇచ్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేవలం స్కిల్‌ కేసుకు సంబంధించి మాత్రమే ఇరుపక్షాలు మాట్లాడవద్దని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. చంద్రబాబును రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా సమస్యలపై ఆయన పర్యటనలను అడ్డుకునేందుకు సీఐడి ద్వారా అడ్డుకునే కుట్ర జగన్‌రెడ్డి చేస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టాలన్న సీఐడీ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది అని చెప్పుకొచ్చారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసిందని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు.

దొంగే దొంగ అని అబద్ధపు ప్రచారం

జగన్‌రెడ్డి 99% మేనిఫెస్టో హామీలు అమలుచేసి వుంటే, లక్షల కోట్ల కుంభకోణాలు చేయకుండా వుండి వుంటే చంద్రబాబు ప్రజా పర్యటనలను అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. తన ప్రజా వ్యతిరేక విధానాలు, లక్షల కోట్ల లూటీని కప్పిపెట్టుకోవడానికే వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి అక్రమ కేసులు సీఐడీతో పెట్టించారని ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అని అబద్ధపు ప్రచారాలు నీలి మీడియా ద్వారా చేస్తున్నారు అని విరుచుకచుపడ్డారు. తన అవలక్షణాల్ని ఎదుటి వారికి అంటకట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్‌ నైజం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News