దిశ, ఏపీ బ్యూరో: తొమ్మిది నెలల పసిబిడ్డ కిడ్నాప్ కేసును 24 గంటల్లోనే చేధించారు నెల్లూరు పోలీసులు. కొమరగిరి శీనయ్య, చెంచమ్మ దంపతులది పొదలకూరు మండలం మహమ్మదాపురం. వీరి కుమార్తె తొమ్మిది నెలల క్రితం ఓ పాపకు జన్మనిచ్చి, చనిపోయింది. అప్పటి నుంచి చిన్నారి ఆలనాపాలనా శీనయ్య దంపతులు చూసుకుంటున్నారు. భిక్షాటన చేసుకునే వీరు, మరికొందరితో కలిసి మూడు రోజుల క్రితం నెల్లూరు నగరానికి వచ్చారు. భిక్షాటన అనంతరం పార్క్ వద్ద, రోడ్డుపై నిద్రించేవారు.
ఈ క్రమంలో ఆదివారం నగరంలోని సంతపేట పరిధి గుప్తా పార్కు వద్ద నిద్రిస్తున్న దంపతుల మధ్య ఉన్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పాప కనిపించకపోవడంతో, వృద్ధులు నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గాలింపు చర్యల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఎస్పీ ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతికతను ఉపయోగించి, సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితుడిని కనిపెట్టారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న నిందితుడు పాపను తిరుపతికి తీసుకుపోయినట్లు గుర్తించారు.
తిరుపతికి వెళ్లిన నెల్లూరు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, నగరానికి తీసుకువచ్చారు. పాప దొరకడంతో, వృద్ధుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జల్సాలకు అలవాటు పడి, మద్యానికి బానిసైన నిందితుడు.. పాపను కిడ్నాప్ చేసి అమ్మేందుకు ప్రయత్నించాడు. ముద్దాయి గతంలోను మనుబోలు పరిధిలో ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడని ఎస్పీ వివరించారు. ఆటో నడుపుతున్నట్లు నటించి, నిర్మానుష్య ప్రాంతంలో కిడ్నాప్‌లకు ప్రయత్నించేవాడని తెలిపారు.