నా పొత్తు వారితోనే.. మాచర్లలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో పొత్తులపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పొత్తు ప్రజలతోనేనని ప్రకటించారు.

Update: 2023-11-15 11:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో పొత్తులపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పొత్తు ప్రజలతోనేనని ప్రకటించారు. పేద ప్రజల కోసమే తన పార్టీ అని చెప్పుకొచ్చారు. పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ మాచర్ల వద్ద వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం క్రింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి... ఇవాళ పనులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.‘మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టిందనే చిత్తశుద్ధి నా ధైర్యం. అందుకే దళారులతో పొత్తు పెట్టుకోలేదు. రాబోయే రోజుల్లో ఎన్నికల సంగ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మోసాలకు మోసపోవద్దు.మీ ఇంట్లో మంచి జరిగిందా ? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి.మంచి చేసే మనందరి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు.


ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు, కేజీ బంగారం 

పల్నాడు జిల్లా మాచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో పేదలకు పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, రేషన్‌ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా, లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ, గవర్నమెంట్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. చంద్రబాబు మనసు మారాలంటే, గుండె కరగాలంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు, గుండె కరిగే ఇంజెక్షన్లు ఎన్ని ఇస్తే ఈ పెద్ద మనిషిలో మానవత్వం వస్తుందో ఆలోచన చేయండి అని సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తి ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి కాబట్టి ఒకడే చెబితే నమ్మరని, తనకు తోడు ఇంకో నలుగురిని కలుపుకుంటున్నాడు అని విమర్శలు చేశారు. ఆ నలుగురు ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు, కేజీ బంగారం ఇస్తామంటున్నారు. మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెబితే... నేను దత్తపుత్రుడుని కలిశాను కాబట్టి మరో 6 హామీలు ఇస్తున్నాము. మొత్తం 11 హామీలిస్తున్నామంటున్నారు అవి నమ్మి మోసపోవద్దు అని సీఎం వైఎస్ జగన్ సూచించారు.

బాబు– దత్త పుత్రుడి మోసం

ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. 2014లో పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలిసే పోటీ చేశారని గుర్తు చేశారు. అదే చంద్రబాబుతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారని ఆరోపించారు. ఆ మేనిఫెస్టోకు తానే పూచీ అన్నాడు. వీళ్లద్దరూ అయితే సరిపోరని వీరికి తోడు ప్రధాని నరేంద్రమోడీని తెచ్చుకున్నారన్నారు.అనంతరం ప్రజలను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసునన్నారు. అలాంటి నాయకులు మళ్లీ పొత్తుతో ఎన్నికలకు వస్తున్నారని ఆరోపించారు. 5 హామీలు ఒకరు, 6 హామీలు ఇంకొకరు కలిసి 11 హామీల మేనిఫెస్టో అంటూ హల్చల్ చేస్తున్నారని అలాంటి వారిని నమ్మెుద్దని సూచించారు. మరోవైపు చంద్రబాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకొనేందుకు, వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి బాబు తరపున పనిచేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులు, అనేక పార్టీల్లో తన కోవర్టులు కూడా ఉన్నారని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. అయితే తన ధైర్యం ఇంటింటికీ, అన్ని సామాజిక వర్గాలకూ, అన్ని ప్రాంతాలకు చేసిన మంచి అని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఇంటింటికీ అన్ని సామాజిక వర్గాలకు చేసిన మంచే తన ధైర్యం అన్నారు. బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన రూ. 2.40 లక్షల కోట్లు తన ధైర్యం అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News