ఏపీ లో ఉద్రిక్తత.. తార స్థాయికి చేరుకున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓ వైపు అంగన్ వాడీలు మరో వైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలతో ఆంధ్ర రాష్ట్రం అట్టుడుకుతోంది.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటోంది. ఓ వైపు అంగన్ వాడీలు మరో వైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలతో ఆంధ్ర రాష్ట్రం అట్టుడుకుతోంది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 12వ రోజుకి చేరుకుంది. నిన్న కార్మికులతో వైసీపీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్మికుల సమ్మె తారాస్థాయికి చేరుకుంది. దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల అరెస్టులు.. వాగ్వాదాలు, తోపులాటలతో ఆంధ్ర రాష్ట్రం అట్టుడుకుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్-2 కార్యాలయం వద్ద కార్మికులు భారీ ఆందోళన చేపట్టారు. అలానే కడప లో కూడా ఇదే పరిస్థితి. కడప మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించారు. ఈ నేపథ్యంలో కార్మికులను పోలీసులు అడ్డుకోగా.. పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఇక అన్నమయ్య జిల్లా రాజంపేటలో మున్సిపల్ కార్యాలయంలోకి కార్మికులు దూసుకెళ్లి అధికారులను అడ్డుకున్నారు. కార్యాలయం లోపలికి దూసుకెళ్లిన ఆ కార్మికులను పోలీసులు బయటకు ఈడ్చుకెళ్లారు. అనంతపురం లో కార్మికులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డు పై బైఠాయించిన కార్మికులను పోలీసులుస్టేషన్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక శ్రీకాకుళం, NTR జిల్లా, నందిగామ, గుంటూరు, ఒంగోలు మొదలైన ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి.
ఇక నెల్లూరు లో సీఎం జగన్ మనసు మర్చాలంటూ బారాషాహీద్ దర్గాలో మున్సిపల్ కార్మికులు ప్రార్థించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అలానే ఒంగోలులో చెత్త సేకరణ వాహనాలను మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి మున్సిపల్ కమిషనర్ వాహనాన్ని కూడా అడ్డుకుని డిమాండ్లు వినిపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.