visakha: ఊపందుకున్న బీసీ ఉద్యమం.. కేంద్రంపై పోరుకు డేట్ ఫిక్స్
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు...
దిశ, ఉత్తరాంధ్ర: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, జనగణనలో కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జులై 16న విశాఖ ఏయూ కన్వర్షన్‌లో బీసీ గర్జన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ విద్య నగర్ బీసీ భవన్‌లో విశాఖ బీసీ గర్జన పోస్టర్‌ను ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కుల గణన, బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయాలని కోరారు. కుల గణన జరపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని గుర్తు చేశారు. ఆయా పార్టీ ఎంపీలంతా పార్లమెంట్‌ను స్తంభింప చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులూ డిమాండ్ చేయాలని సూచించారు. ఇతర సమస్యలపై పార్లమెంటులో ఉద్యమాలు చేస్తున్న మాదిరిగా కుల గణనపై కూడా పార్లమెంటులో చర్చ చేయాలని కోరారు.
కేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనగణన చేపట్టే అవకాశం ఉన్నా బీసీ వ్యతిరేక వైఖరితో డిమాండును అంగీకరించడం లేదన్నారు. బీసీ కుల గణనపై కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విధాన ప్రకటన జారీ చేయలేదన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇందుకు రాజ్యంగ సవరణ చేయాలని, పంచాయతీ రాజ్ సంస్థలో ఉన్న బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతంకు పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాడ్ చేశారు.