పోలీసుల కొంపముంచిన మెుబైల్ ట్రాకింగ్: నిందితుడు అనుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి

మొబైల్‌ ట్రాకింగ్‌ తప్పిదంతో సెబ్ పోలీసులు ఇరుకున పడ్డారు.

Update: 2023-11-22 05:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మొబైల్‌ ట్రాకింగ్‌ తప్పిదంతో సెబ్ పోలీసులు ఇరుకున పడ్డారు. ఓ కేసులో నిందితుడిని వెతికే క్రమంలో సెబ్‌ పోలీసులు అతడి మెుబైల్ నెంబర్‌‌ను ట్రాకింగ్‌లో పెట్టారు. అయితే అతడు ఓ గ్రౌండ్‌లో ఉన్నట్లు మెబైల్ ట్రాకింగ్‌లో చూపించడంతో పొరపాటున ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై సెబ్ పోలీసులు తీవ్ర ప్రతాపం చూపించారు. ఆయనపై కాపు కాచి మరీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన అనంతపురం జేఎన్‌టీయూ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే అనంతపురంకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ప్రతీరోజూ జేఎన్‌టీయూలోని మైదానంలో మార్నింగ్ వాకింగ్‌ చేస్తుంటారు. రోజూ మాదిరిగానే మంగళవారం తెల్లవారుజామున వాకింగ్‌ చేస్తుండగా ఇద్దరు అమాంతంగా మీద పడి గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో పెనుగులాట చోటుచేసుకుంది. తనను పట్టుకున్న వారు దొంగలు అని భావించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు వారిపై తిరగబడ్డారు. ఈ పెనుగులాటలో చంద్రశేఖర్‌ను సెబ్ అధికారులు బలంగా కిందకు నెట్టారు. దీంతో బాధితుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం అక్కడ నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సివిల్ డ్రస్‌లో చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి పాల్పడింది తాడిపత్రి సెబ్‌ పోలీసులేనని తేలింది.

అసలు జరిగిందేంటంటే!

ఈ దాడి వెనుక పెద్ద తతంగమే ఉందని తెలుస్తోంది. తాడిపత్రికి చెందిన రామాంజనేయరెడ్డి అనంతపురంలో ఉంటూ గోవా మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు. దీంతో అతడి నుంచి మద్యం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఇటీవలే తాడిపత్రి సెబ్ పోలీసులకు పట్టుబట్టాడు. ఈ మద్యం ఎక్కడ నుంచి వచ్చిందని ఆరా తీయగా తనకు రామాంజనేయ రెడ్డి ఇచ్చాడని అతడి దగ్గర కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో అతడి వద్ద నుంచి రామాంజనేయ రెడ్డి ఫోన్ నెంబర్ తీసుకుని లోకేషన్ సెర్చ్ చేశారు. అయితే ఫోన్ లొకేషన్ మంగళవారం జేఎన్‌టీయూ మైదానంలో ఉన్నట్లు సూచించింది. దీంతో ఇద్దరు సెబ్ కానిస్టేబుళ్లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డిని చూసి ఆయనే రామాంజనేయ రెడ్డిగా భావించి దాడికి పాల్పడ్డారు. సెబ్ అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడటంతో అక్కడ నుంచి పరారయ్యారు. అనంతరం సెబ్ అధికారులే చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని తెలిసింది. దీంతో వివరణ కోరగా లొకేషన్‌ తప్పుగా చూపించడంతో గందరగోళానికి గురై ఈ తప్పిదం జరిగిందని సెబ్‌ అదనపు ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. ఈ ఘటన జరిగినందుకు తాను చింతిస్తున్నానని.. దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు.

Tags:    

Similar News