AP News:పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు.
దిశ,ఏలూరు:పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు లోని స్పిల్ వే, స్పిల్ ఛానల్, డయా ఫ్రమ్ వాల్, పవర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 12.5 కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతాయని, ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేయడమే కాకుండా అంశంపై అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశారని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. నిర్వాసితుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ సందర్భంగా పైడిపాక పునరావాస గ్రామస్తులు నీరుడు అబ్బులు నీరుడు నరేష్ తమకు పరిహారం అందలేదని తమకు పరిహారాలు అందేలా చూడాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కొణతాల ప్రసాద్, కరి బండి నాగరాజు, ఆటపాకల వెంకటేశ్వరరావు తెలగంశెట్టి రామ ప్రసాద్ ఉన్నారు.