అమాత్యా మీకు తగునా... ఓటు హక్కు కోసం అంతపని చేసిన మంత్రి విడదల రజినీ..
ఒకవైపు అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లను చేరుస్తూ ప్రజాస్వమ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఒకవైపు అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లను చేరుస్తూ ప్రజాస్వమ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మరోవైపు అమాత్యులు సైతం దొడ్డిదారిన ఓటు హక్కు పొందుతూ అభాసుపాలు అవుతున్నారు. తాజాగా ఓటు హక్కు కోసం సాక్షాత్తూ.. మంత్రి విడదల రజినీ తప్పుడు చిరునామాను ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన చిరునామాలో అపార్ట్‌మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై టీడీడీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కు దరఖాస్తు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి రజినీకి గుంటూరులో ఓటు హక్కు కల్పించకూడదంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమ పట్నంలో ఆమె ఓటు ఉందని టీడీపీ నేతలు తెలిపారు. విడదల రజినీ ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ నియమించింది. ఈ నేపథ్యంలోనే రజినీ గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.