Minister Subhash: వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో ట్విస్ట్.. మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

వాలంటీర్ దుర్గా ప్రసాద్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Update: 2024-10-21 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాలంటీర్ దుర్గా ప్రసాద్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు మధురైలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన రామచంద్రాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. దుర్గా‌ ప్రసాద్ హత్యలో శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు రౌడీ షీటర్ల ప్రమేయం ఉందని తెలిపారు. మాజీ మంత్రి విశ్వరూప్ తన పదవిని అడ్డు పెట్టుకుని దర్యాప్తును ముందుకు వెళ్లనివ్వలేదని ఆరోపించారు. దుర్గా ప్రసాద్ హత్యకు గురైన వెంటనే అతడి భార్యకు శ్రీకాంత్ రూ.లక్ష ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా కేసు విత్‌డ్రా చేసుకుంటే 2 ఎకరాల భూమి ఇస్తామని విశ్వరూప్ కూడా హామీ ఇచ్చారని మంత్రి సుభాష్ ఆరోపించారు. కానీ, ఇప్పుడు బాధితురాలే ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టిందని గుర్తు చేశారు. విచారణలో అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.

కాగా, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల పరిధిలోని అయినవిల్లికి చెందిన దళిత యువకుడు, వాలంటీర్ దుర్గప్రసాద్ కోనసీమ అల్లర్ల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ముందు మిస్సింగ్ కేసుగా పోలీసులు.. దుర్గా ప్రసాద్ మృతదేహం దొరకడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, మృతుడి స్నేహితుడు ధర్మేశ్‌ను పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుర్గా ప్రసాద్‌ను శ్రీకాంత్ అంతమొందించేందుకు మరో నలుగురి సాయం కోరినట్లు విచారణలో తేలింది.  


Similar News