జ‌గ‌న్ పై విరుచుకుప‌డిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

జ‌గ‌న్ పై విరుచుకుప‌డిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

Update: 2024-09-11 09:21 GMT

దిశ, విజ‌య‌వాడ‌: జైలులో ఉన్న నేర‌స్థుడిని చూడ్డానికి వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వ‌ర‌ద బాధితులు క‌నిపించ‌డంలేదా అని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ విరుచుకుప‌డ్డారు. హైద‌రాబాద్ లోని క్ష‌త్రియ ఎంట‌ర్ ప్రినియ‌ర్స్ ఫెడ‌రేష‌న్ సౌజ‌న్యంతో విజ‌య‌వాడ క్ష‌త్రియ సేవా సంఘం, యువ‌జ‌న సంఘం ఆధ్వ‌ర్యంలో అయోధ్య‌న‌గ‌ర్ క్ష‌త్రియ భ‌వ‌న్‌లో బుధ‌వారం నాడు వ‌ర‌ద బాధితుల‌కు 500 నిత్యావ‌స‌ర స‌ర‌కుల కిట్ల‌ను విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో క‌లిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు సామాజిక బాధ్య‌త‌ను మ‌ర‌చి విమ‌ర్శ‌లు చేయడం జ‌గ‌న్ కే చెల్లుతుంద‌న్నారు. చుట్ట‌పు చూపున‌కు వ‌చ్చిన‌ట్టు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయిన జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో ప‌నిచేసిన ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డం సిగ్గుచేటన్నారు.

ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పినా ఇంకా జ‌గ‌న్ కు బుద్ధిరాలేద‌న్నారు. ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు నేతృత్వంలో బాధ్య‌త‌కు మించి మంత్రులు, ఐఎఎస్ లు, ఎమ్మెల్యేలతో పాటు ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా నిలిచింద‌న్నారు. వార్డుకో మంత్రిని, సీనియ‌ర్ ఐఎఎస్ అధికారుల్ని నియ‌మించి ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని చంద్ర‌బాబు ప‌రుగులు పెట్టించార‌ని, చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వ‌ర‌ద బాధితులకు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచి భ‌రోసా ఇచ్చింద‌న్నారు.

పార్వ‌తీపురం ఎమ్మెల్యే విజ‌య‌చంద్ర స్వ‌యంగా ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ర‌ద బాధితుల‌కు ఆదుకునేందుకు వ‌చ్చారంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏవిధంగా దిశానిర్దేశం చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేద‌న్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్ర‌భుత్వం అధికారంలో ఉంటే ఎంత స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేయ‌గ‌లుగుతారో విజ‌య‌వాడ వ‌ర‌ద విప‌త్తు నిర్వ‌హ‌ణే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. వ‌ర‌ద బాధితుల‌కు సేవ‌లందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 700 మంది సైనికుల్ని విజ‌య‌వాడ‌కు పంపించింద‌న్నారు. బుడ‌మేరు వ‌ర‌ద‌కు శాస్వత ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి వ‌ర‌ద‌లు సంభ‌వించ‌కుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల్ని చేప‌డుతుంద‌న్నారు. క్ష‌త్రియ సేవా సంఘం ఇంత పెద్ద ఎత్తున బాధితుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల్ని అంద‌జేయ‌డం వారి సేవా భావానికి నిద‌ర్శ‌న‌మ‌ని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగ‌తా సంస్థ‌లు, యాజ‌మాన్యాలు బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాల‌న్నారు.

విజ‌య‌వాడ‌కు మ‌న‌మేమిచ్చాం అనే విధంగా అంద‌రూ వ‌ర‌ద బాధితుల్ని ఆదుకుని ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు. వ‌ర‌ద‌లు సంభ‌వించిన వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాల‌తో ఇంటింటికీ దాదాపు 2 ల‌క్ష‌ల అత్య‌వ‌స మందుల కిట్ల‌ను వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింద‌న్నారు. వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో 200 మెడిక‌ల్ క్యాంపుల్ని నిర్వ‌హించామ‌ని, 450 మంది సీహెచ్వోలు ఇంటింటికీ వెళ్లి స‌ర్వే చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. మెడిక‌ల్ క్యాంపులు, 104 మొబైల్ మెడిక‌ల్ వాహ‌నాల్లోనూ అన్ని మందులూ అందుబాటులో ఉంచామ‌న్నారు.

వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో దోమ‌ల లార్వాలు వృద్ధి చెంద‌కుండా ఉండేందుకు 900 మంది వైద్య సిబ్బంది యాంటీ లార్వా ఆప‌రేష‌న్ లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని మంత్రి పేర్కొన్నారు. 5 ప్రైవేట్ మెడ‌క‌ల్ కాలేజీలు, రెండు ప్ర‌భుత్వ మెడ‌క‌ల్ కాలేజీలకు చెందిన స్పెష‌లిష్టు డాక్ట‌ర్లు తీవ్రంగా దెబ్బతిన్న 16 వార్డుల్లో వైద్య శిబిరాల్లో వైద్య సేవ‌లు, చికిత్స అందిస్తార‌న్నారు. బాధిత కుటుంబాల త‌లుపు త‌ట్టి మ‌రీ వైద్య ఆరోగ్య శాఖ సేవ‌లందిస్తోంద‌ని, చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఈ ర‌కంగా ఆదుకున్న దాఖలాలు లేవ‌న్నారు.

ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ఇరిగేష‌న్ శాఖ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందునే ఈ ప‌రిస్థితి దాపురించింద‌న్నారు. ప్ర‌భుత్వం స‌మ‌ర్ధ‌వంతంగా వ‌ర‌ద బాధితుల్ని ఆదుకుంద‌న్నారు. క్ష‌త్రియ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ పెనుమ‌త్స అప్ప‌ల‌రాజు మాట్లాడుతూ ఆదివారం నాడు సింగ్ న‌గ‌ర్ లో బాధితుల‌కు మ‌రో 500 నిత్యావ‌స‌ర స‌ర‌కుల కిట్ల‌ను, 2 దుప్ప‌ట్ల‌ను అంద‌జేస్తామ‌న్నారు. పార్వ‌తీపురం ఎమ్మెల్యే విజ‌య‌చంద్ర‌ క్ష‌త్రియ ఎంట‌ర్ ప్రిన‌ర్స్ ఫెడ‌రేష‌న్ (హైద‌రాబాద్‌) ప్ర‌తినిధి వేగేశ్న వెంక‌టేశ్వ‌ర రాజు, క్ష‌త్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ సాగి న‌ర‌సింహ‌రాజు, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఉద్ద‌రాజు విజ‌య‌రామ‌రాజు, క్ష‌త్రియ యువ‌జన సంఘం ప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News