Minister Nagarjuna: టీడీపీ మేనిఫెస్టోపై సంచలన వ్యాఖ్యలు
పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు రాష్ట్రంలోని పేదలందర్నీ ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు...
దిశ, డైనమిక్ బ్యూరో: పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు రాష్ట్రంలోని పేదలందర్నీ ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననే చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి మేరుగ నాగార్జున మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు.
అమ్మకు వందనం అనే పేరుతో ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టారన్నారు. పేదలకు ఒక సెంటు భూమి ఇస్తే ఓర్చుకోలేనివాడు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తామంటే సహించలేని వాడు..పేదలకు మేలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని కోర్టుకు వెళ్లి అడ్డుకునేవాడు చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు. అలాంటి చంద్రబాబు ఇవాళ తనను గెలిపిస్తే రాష్ట్రంలోని పేదలందరినీ ధనవంతులను చేస్తానని చెబితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం చంద్రబాబుకు తన 75 ఏళ్ల వయసులో, రాజకీయ జీవన సంధ్యలో గుర్తొచ్చిందా అని నిలదీశారు.
2014 ఎన్నికలలో చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదని నాగార్జున విమర్శించారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏనాడు కూడా తాను ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయలేదని, అందుకే ఆయన ప్రకటించిన మేనిఫెస్టోకు కూడా ఎలాంటి విలువ లేదని నాగార్జున మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు చెబితే 2 రూపాయలకే కిలో బియ్యం పథకం, వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ పథకాలు గుర్తొస్తాయని, అలాగే సీఎం వైఎస్ జగన్ పేరు చెబితే నవరత్నాలు గుర్తుకువస్తాయన్నారు. అయితే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే అలాంటి ఏ పథకమూ గుర్తుకు రాదని మంత్రి మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి: