Elections: వైసీపీ విమర్శలకు మంత్రి ఆనం స్ట్రాంగ్ కౌంటర్
సాగునీటి సంఘాల ఎన్నికలపై వైసీపీ విమర్శలకు మంత్రి ఆనం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14న సాగునీటి సంఘాల ఎన్నికలు(Irrigation Societies Elections) జరిగాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు 14న, డిస్ట్రిబ్యూరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలకు ఈ నెల 17న ఎన్నికలు కూడా జరిగాయి. రైతు ప్రయోజనాలకు ముడి పడి ఉండే ఈ ఎన్నికల్లో వైసీపీ(Ycp) తొలుత పోటీ చేయాలని భావించింది. తమ మద్దతు దారులను రంగంలోకి దింపింది. కానీ చివరికి పోటీ నుంచి విరమించుకుంది. దీంతో టీడీపీ(Tdp) మద్దతుదారులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. చెదురుమదురు ఘటనల మినహా ఎన్నికలు సజావుగా జరిగాయి.
అయితే ఈ ఎన్నికలను గతంలోనే నిర్వహించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు జరపలేదు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో సాగు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అనంతరం ఫలితాలు సైతం విడుదల అయ్యాయి. చాలా వరకూ టీడీపీ మద్దతుదారులు ఏకపక్షంగా గెలుపొందారు. దీంతో వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, దురాలోచనతో అరాచాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanaraya Reddy) ఖండించారు. సాగునీటి సంఘాల ఎన్నికలపై ప్రతిపక్షం ఆరోపణలు సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ నిర్వీర్యం చేసిందని, సోమశిల ప్రాజెక్ట్ దెబ్బతినడానికి కారణం వైసీపీనేనని మంత్రి ఆనం పేర్కొన్నారు.