JPC : జమిలి ఎన్నికల జేపీసీలోకి డాక్టర్ కే లక్ష్మణ్, విజయసాయి రెడ్డి

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల(One Nation One Election) కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లోని సభ్యుల సంఖ్యను పెంచారు.

Update: 2024-12-20 14:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల(One Nation One Election) కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లోని సభ్యుల సంఖ్యను పెంచారు. దానిలో ఉండే సభ్యుల గరిష్ఠ సంఖ్య తొలుత 31 ఉండగా.. దాన్ని 39కి పెంచారు. దీంతో మరింత మంది ఎంపీలకు జేపీసీలో చోటుదక్కింది. మొత్తం 39 మంది సభ్యుల్లో 27 మంది లోక్‌సభ ఎంపీలు కాగా, 12 మంది రాజ్యసభ ఎంపీలు. రాజ్యసభ(Rajya Sabha) నుంచి ఈ కమిటీలోకి 10 మందినే నామినేట్ చేస్తారని భావించినప్పటికీ.. దాని నుంచి అదనంగా మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. 12 మంది ఎంపీలను జేపీసీకి నామినేట్ చేసే తీర్మానానికి రాజ్యసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. జేపీసీలో చోటుపొందిన రాజ్యసభ ఎంపీల జాబితాలో.. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, ఘనశ్యాం తివారీ, భువనేశ్వర్ కాలిత, కవితా పాటీదార్, సంజయ్ కుమార్ ఝా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ బాల్ క్రిష్ణ వాస్నిక్, సాకేత్ గోఖలే, పి.ఎస్.విల్సన్, సంజయ్ సింగ్, మానస్ రంజన్ మాంగ్ రంజ్ ఉన్నారు. ఇక లోక్‌సభ వైపు నుంచి ఈ కమిటీలోకి కొత్త నామినేట్ అయిన వారిలో బీజేపీ ఎంపీలు వైజయంత్ పాండా, సంజయ్ జైస్వాల్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఛోటా లాల్, శివసేన (ఉద్ధవ్) ఎంపీ అనిల్ దేశాయ్, లోక్ జనశక్తి పార్టీ ఎంపీ శాంభవి, సీపీఎం ఎంపీ కె.రాధాక్రిష్ణన్ ఉన్నారు. లోక్‌సభ నుంచి జేపీసీకి నామినేట్ అయిన మొత్తం ఎంపీల్లో 17 మంది ఎన్డీయే కూటమివారు కాగా, వారిలో 12 మంది బీజేపీ ఎంపీలే.

వాయిస్ ఓట్‌తో తీర్మానానికి ఆమోదం

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రోజు లోక్‌సభలో విపక్షాలు గళమెత్తాయి. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల నడుమ అత్యంత కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం గడిచిపోయింది. పార్లమెంటు సెషన్ ముగియనున్న తరుణంలో స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు 2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2024‌లను జేపీసీకి సిఫార్సు చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్‌కు స్పీకర్ సూచించారు. ఓ వైపు అమిత్‌షాకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగా.. మరోవైపు వాయిస్ ఓట్ ద్వారా ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లులను జేపీసీ పరిశీలనకు పంపేందుకు మార్గం సుగమం అయింది. అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. నవంబరు 25న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ పరిణామాలతో శుక్రవారం రోజు ముగిశాయి.

Tags:    

Similar News