Copra : కొబ్బరికి కనీస మద్దతు ధరలు పెంపు.. కేంద్ర క్యాబినెట్ భేటీలో నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో : కొబ్బరి రైతులకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది.
దిశ, నేషనల్ బ్యూరో : కొబ్బరి రైతులకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. మిల్లింగ్‌లో వాడే ఎండు కొబ్బరి(Copra)కి కనీస మద్దతు ధర(MSP)ను క్వింటాలుకు రూ.11,582, చిప్పలుగా చేయకుండా గుండ్రంగా ఉండే ఎండు కొబ్బరి(బాల్ కోప్రా)కి ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.12,100గా నిర్ణయించారు. బాల్ కోప్రా ధరను క్వింటాలుకు రూ.100 చొప్పున, మిల్లింగ్ కోప్రా ధరను క్వింటాలుకు రూ.420 చొప్పున పెంచారు. శుక్రవారం రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో జరిగిన కేంద్ర క్యాబినెట్(Cabinet) ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన కొబ్బరి సీజన్‌లో ఈ కనీస మద్దతు ధరలు అమలవుతాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
కొబ్బరి ఎంఎస్‌పీ పెంపు అమలుకు వచ్చే ఏడాది దాదాపు రూ.855 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ వంటి కోఆపరేటివ్ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థలుగా వ్యవహరించి కొబ్బరిని కొనుగోలు చేస్తాయని ఆయన ప్రకటించారు. కొబ్బరి ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొబ్బరిసాగును ప్రోత్సహించడంతో పాటు దానితో తయారయ్యే ఉత్పత్తుల రంగాలకు దన్నుగా నిలిచే లక్ష్యంతో ఎంఎస్‌పీని ప్రకటించినట్లు చెప్పారు.