దిశ, వెబ్ డెస్క్: రూ.3 లక్షలు తీసుకొని.. పెళ్లి అయిన 15 రోజులకే భార్య జంప్ అయింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన వేమారెడ్డికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాలేదు. దీంతో భీమవరానికి చెందిన ఒక మ్యారేజ్ బ్యూరో సంస్థను సంప్రదించారు. రూ.3 లక్షలు చెల్లించి, వారు చూపిన యువతిని పెళ్ళి చేసుకున్నారు. అయితే పెళ్లి నాటి నుంచి వేమారెడ్డిని ఆ యువతి దూరం పెడుతూ వచ్చింది. 15 రోజుల తర్వాత తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, చూసి వస్తానని వేమారెడ్డితో చెప్పింది.
దీంతో ఆమెను వేమారెడ్డి భీమవరానికి తీసుకువెళ్లారు. అయితే రైల్వేస్టేషన్‌లో దిగగానే తమ పెళ్ళి విషయం ఇంట్లో తెలియదని, వేమారెడ్డిని రావొద్దంటూ భార్య అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. మూడు రోజుల పాటు భార్య కోసం వేమారెడ్డి భీమవరంలో వెతికారు. చివరికి ఆమె మోసం చేసిందని తెలియడంతో షాక్‌కు గురయ్యారు. మ్యారేజ్ బ్యూరో వారిని అడిగితే తాము పెళ్ళి మాత్రమే చేస్తామని, మిగిలినవి తమరే చూసుకోవాలంటూ చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే వెళ్లి హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతితో పాటు తనను మోసం చేసిన మ్యారేజ్ బ్యూరోపైనా చర్యలు తీసుకోవాలని వేమారెడ్డి కోరారు.