Tirumala: ఫేక్ ఆధార్‌తో శ్రీవారి టికెట్లు తీసుకున్న వ్యక్తి అరెస్ట్
తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ...
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. టికెట్లు దొరక్కపోయినా గంటల తరబడి నిల్చుకుని స్వామి వారి సేవా భాగ్యం చేసుకుని వెళ్తుంటారు. అయితే కొందరు వ్యక్తులు శ్రీవారి టికెట్లను సైతం అక్రమంగా తీసుకుంటున్నారు. ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా 20, 30 సార్లు టికెట్లు పొందుతున్నారు. ఫేక్ ఆధార్ కార్డులు చూపించి స్వామివారి చెంతనే పాపాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తిరుమలలో మరోసారి వెలుగులోకి వచ్చింది.
తాజాగా తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ ఆధార్ కార్డుతో శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్లేందుకు శ్రీధర్ అనే వ్యక్తి యత్నించారు. దీంతో ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్కీ డిప్ ద్వారా 20 సార్లు స్వామివారి సుప్రభాత సేవా టికెట్లను పొందినట్లు గుర్తించారు. మొత్తం 400 సార్లు ఫేక్ ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ధృవీకరించారు. దీంతో శ్రీధర్ వెనుక ఎవరున్నారనే అంశాలపై విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. టీటీడీ సిబ్బంది సహకరించారా..?, టికెట్ల పొంది అమ్ముకున్నారా?.. అనే కోణంలో ఆరా తీస్తున్నారు.