ఆ జిల్లాలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను చిరుత పులి వణికిస్తోంది.

Update: 2024-10-20 14:09 GMT

దిశ, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను చిరుత పులి వణికిస్తోంది. కడియం నర్సరీ నుంచి రాజమహేంద్రవరం రూరల్ మండలం లో విస్తృతంగా సంచరించిన చిరుత ఇప్పుడు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి గ్రామంలో తిరుగుతుంది. చిరుత సంచారం విషయం తెలుసుకున్న మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అమర్చిన సీసీ టీవీల ఫుటేజ్‌ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకా నగర్‌లో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. వీరాంజనేయ దాబా సమీపంలో చిరుత పులి కదలికలను స్థానికులు గుర్తించి వెంటనే పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులు పాదముద్రలను పరిశీలించి అవి చిరుత పులివేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చిరుత పాదముద్రలను సేకరించారు. వాటిని టెస్ట్ నిమిత్తం రాజమండ్రి ల్యాబ్ కు తరలించారు. అంతేకాకుండా చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేలా చుట్టూ పక్కల ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒంటరిగా బయట సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సి సి ఫుటేజ్‌లను పరిశీలించారు. అయితే ఎందులోనూ చిరుతపులి జాడ చిక్కలేదు. భీమడోలు శివారు ప్రాంతాల్లో పులి సంచారం జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది, ఈ దృష్ట్యా భీమడోలు పరిసర ప్రాంతాలైన పొలసానిపల్లి, అంబర్పేట, అర్జ వారి గూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆరు నెలల ముందు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంత మండలాల ప్రజలకు చిరుత, పెద్ద పులి ముచ్చెమటలు పట్టించాయి. చివరకు పోలవరం మండలం మీదుగా పాపి కొండల వైపు వెళ్లాయి. ఇప్పుడు మళ్లీ చిరుత కనిపించడంతో భయాందోళన చెందుతున్నారు


Similar News