Telangana Court: నా వాదనలూ వినండి.. అనూహ్యంగా వైఎస్ సునీత పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమలుపు చోటు చేసుకుంది...
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమలుపు చోటు చేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో తనను ఇంప్లీడ్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు చేరుకున్న ఆమె ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్‌లో తనపై, తన కుటంబ సభ్యులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన వాదనలను కూడా వినాలని ఆ పిటిషన్‌లో వైఎస్ సునీతారెడ్డి కోరారు.
వివేకా హత్య కేసులో రెండో పెళ్లి కూడా కీలకమే
కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో పెళ్లి అనేది కూడా కీలకమైన అంశం అని ఆ దిశగా కూడా సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2010లో షేక్ షమీమ్ అనే మహిళను వైఎస్ వివేకా రెండో పెళ్లి చేసుకుని 2015లో ఓ కుమారుడికి జన్మనిచ్చారని ఆరోపించారు. అయితే ఈ రెండో పెళ్లి వైఎస్ వివేకా తనయ సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, బావ ఎన్ శివప్రకాశ్‌రెడ్డిలకు నచ్చలేదని అప్పటి నుంచి శత్రువుగా చూసేవారని ఆరోపించారు. ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని ఫలితంగా కొన్ని కంపెనీలలో వివేకానంద రెడ్డి చెక్ పవర్‌ను సైతం సునీతారెడ్డి రద్దు చేయడంతో వివేకానందరెడ్డి ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు.
వాళ్లకు ఆస్తులు ఇవ్వాలనుకున్న వివేకా
అంతేకాదు వివేకానందరెడ్డి షమీమ్‌కు పుట్టిన తనయుడిని రాజకీయ వారసుడిగా చేయాలని, ఆయన ఆస్తులను కూడా రెండో భార్య పేరుపై రాయాలని భావించినట్లు అవినాశ్ తెలిపారు. ఈ ఆస్తులపై జరిగిన గొడవల వల్లే వివేకానందరెడ్డి హత్య జరిగిందని వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో రెండో పెళ్లి కూడా కీలకమని ఆరోపించారు. వైఎస్ సునీతారెడ్డి తనను ఎంతలా టార్గెట్ చేసినా ఈ విషయాన్ని ఎక్కడా బహిర్గతం చేయలేదని అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. వివేకా హత్య రోజున ఇంట్లో దొరికిన లేఖను సునీతరెడ్డి భర్త దాచిపెట్టాలని ఎందుకు చెప్పారని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తప్పుదోవ పడుతోన్న సీబీఐ విచారణ
దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ తప్పుదోవపడుతుందని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీబీఐ విచారణ జరిగిందన్నారు. అయితే విచారణ సమయంలో కేవలం ల్యాప్ ట్యాప్ మాత్రమే అధికారులు తీసుకువస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రెండుసార్లు విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ల్యాప్‌టాప్‌లో రికార్డింగ్ చేస్తున్నారో లేదో తెలియడం లేదని, అందువల్లే కోర్టును ఆశ్రయించినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు.
ఇక నుంచి మౌనంగా ఉండను..
వైఎస్ వివేకా హత్యకేసులో తనపై ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగానే ఉన్నానని అవినాశ్ రెడ్డి పేర్కొ్న్నారు. ఈ హత్యకేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన తరఫున వివేకానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారనే కట్టుకథను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ ఏకపక్షంగా జరుగుతుందనే అనుమానం కలుగుతుందన్నారు. న్యాయం కోసం ఎంత వరకైనా వెళ్తానని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఈ హత్య కేసు విచారణకు సంబంధించి సీబీఐ వాళ్లే వైఎస్ సునీతారెడ్డికి సమాచారం అందిస్తున్నారని చెప్పారు. అంతేకాదు సీబీఐ అధికారులు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను లంచ్‌మోషన్ వేసిన వెంటనే వైఎస్ సునీతకు సీబీఐ సమాచారం అందజేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పెద్ద కుట్ర ఉందేమోనని తనుకు అనిపిస్తోందన్నారు. కంచె చేనుమేసే విధంగా సీబీఐ వ్యవహరిస్తోందన్న అనుమానాలు ఉన్నాయని ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
అవినాశ్ రెడ్డికి స్వల్ప ఊరట
ఇకపోతే వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోరారు. అంతేకాదు న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగడం లేదని పిటిషన్‌లో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే అనినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అవినాశ్ రెడ్డి అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకానందారెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకూదని సీబీఐకి ఆదేశాలివ్వాలంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన వేసిన రిట్ పిటిషన్‌పై విచారించిన ధర్మసనం.. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సూచించింది. అవినాశ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.