ఉమ్మడి కార్యచరణ మెుదలు పెడతాం.. ఇక వైసీపీ ప్యాకప్ : నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ మొదలు పెడతాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ మొదలు పెడతాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో అందరూ బాధితులుగా మారారు అని లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతి రైతులపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని...వైసీపీ చేసే ప్రతి తప్పును ప్రజా క్షేత్రంలో ఎండగడతాం అని లోకేశ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుంది అని ప్రకటించారు. బీజేపీ అధిష్టానం తమతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఉమ్మడి కార్యచరణపై జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది అని తెలిపారు. అంతా కలిసి ఈ ప్రజావ్యతిరేక జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడతాం అని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు. నా భార్య బ్రాహ్మణిపై కూడా అసభ్య పోస్టులు పెట్టారు అని లోకేశ్ చెప్పుకొచ్చారు. భువనేశ్వరి కళ్లలో నవ్వు చూసేవరకు పోరాటం కొనసాగుతుందని పవన్ చెప్పారు.అమ్మతో పవన్ మనసు విప్పి మాట్లాడారు... ఎంతో ధైర్యం చెప్పారు అని లోకేశ్ తెలిపారు.
వైసీపీపై యుద్ధం మెుదలు పెడతాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఎంతో మందిని అన్యాయంగా వైసీపీ నేతలు చంపేశారు అని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కేసులు ఉండవు..కానీ పవన్ అమరావతి వస్తుంటే అడ్డుకున్నారు. పవన్ మంగళగిరి ఆఫీస్‌కు వెళ్తే తప్పేముంది అని లోకేశ్ ప్రశ్నించారు. విపక్షాల సభలను అడ్డుకోవడమే వైసీపీ పని అని చెప్పుకొచ్చారు. భీమవరంలో యువగళం పాదయాత్ర జరుగుతుంటే రాళ్ల దాడి చేశారు అని ఆరోపించారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా అరెస్టు చేశారు. పోలవరం పనులు 70 శాతం పూర్తి చేసినందుకేనా అరెస్టు చేసింది. వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం మొదలు పెట్టాలని నిర్ణయించాం అని లోకేశ్ హెచ్చరించారు.
మేం ఏ తప్పు చేయలేదు
వైసీపీ ప్యాకప్ అయ్యే టైం వచ్చింది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. స్కిల్ స్కామ్ కేసులో వైసీపీవీ అన్ని నిరాధార ఆరోపణలు అని చెప్పుకొచ్చారు. ఎవరికి భయపడాల్సిన అవసరం తమకు లేదని లోకేశ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో తాము ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని అన్నారు. పదవులను స్వలాభం కోసం ఏనాడు తాము వాడుకోలేదు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
జైలులో భద్రతపై అనుమానం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో గంజాయి స్మగ్లర్లు, నేరస్థులు ఉన్నారని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు జైలులో భద్రత ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రజల తరపున పోరాడితే అడుగడుగునా అవమానించారని లోకేశ్ స్పష్టం చేశారు.‘నా తల్లిని అవమానించారు, నన్ను దూషించారు.. బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు’అని లోకేశ్ గుర్తు చేశారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదని లోకేశ్ స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్యాకేజీ తీసుకుంటున్నారని వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నట్లు ఒక్క ఆధారం చూపాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటు అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.