Srisailam Mallanna Temple:కార్తీకమాసంలో భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవల పై దేవస్థానం కీలక నిర్ణయం
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబరు 1 వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
దిశ,శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబరు 1 వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ రోజులు శని, ఆది, సోమవారాలు పౌర్ణమి, ఏకాదశి, సెలవు రోజులు మొత్తం 16 రోజుల పాటు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తూ భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన ద్వారా తెలిపారు.
అలాగే కార్తీకమాసం సాధారణ రోజులు మొత్తం 14 రోజుల్లో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం,సామూహిక అభిషేకాలు మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అలాగే అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన కూడా అమ్మవారి ఆశీర్వచన మండపంలో అందుబాటులో ఉంచామన్నారు. అలాగే కార్తీకమాసం భక్తుల రద్దీ రోజుల్లో 500 దర్శనం అందుబాటులో ఉన్న 500 టికెట్ పొందిన భక్తులకు కూడా శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని అలాగే భక్తులు దర్శనం టికెట్లను దేవస్థానం వెబ్సైట్‌లో ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని ఆలయ ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.