కర్నూల్ వైసీపీలో నైరాశ్యం.. ఇంచార్జి రేసులో కీలక నేతలు
ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇంచార్జి మార్పు తప్పనిసరి కానుందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
దిశ ప్రతినిధి, కర్నూలు: కర్నూలు వైసీపీలో నైరాశ్యం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పార్టీ నేతలను కుంగుబాటుకు గురి చేసింది. ఐఏఎస్ ఉద్యోగాన్ని రాజకీయం కోసం త్యాగం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎన్నో ఆశలతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తే.. ఓటమి వెక్కిరింతల పాలుచేసింది. ఓటమి తర్వాత నేతలు ఒక్కొక్కరూ నియోజకవర్గాన్ని వీడి నగరాలకు చేరుకుని తమ వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో చాలా మంది కార్పొరేటర్లు నేతల నుంచి తమకు ఎలాంటి భరోసా లేదని భావించి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో పార్టీని చక్కబెట్టే బాధ్యత జిల్లా బాస్, ఎస్వీ మోహన్ రెడ్డిపై పడింది. ఈ సెగ్మెంట్‌కు నూతన ఇంచార్జిని నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంచార్జి రేసులో మాజీ ఎమ్మెల్యే, మాజీ కేడీసీసీ చైర్ పర్సన్‌లు ఉన్నట్లు సమాచారం.
ఇంతియాజ్ కు టికెట్ ఇచ్చినా..
2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ హఫీజ్ ఖాన్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పై 5,353 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024లో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి టీజీ భరత్ వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ పై 18,876 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికలకు ముందు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిలు ప్రయత్నాలు చేశారు. అధిష్టానం వారిద్దరికీ కాదని ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ కు టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో సీటు దక్కని మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ, వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ కర్నూలు నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌కు పట్టం కట్టారు.
కనువిప్పు కలిగిందా..?
ఇంతియాజ్ ఓటమి పార్టీ పెద్దలతో పాటు జిల్లా నేతలకు కనువిప్పు కల్గించింది. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేతలకు కాకుండా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం మైనస్‌గా మారింది. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు ఓటమి చెందేలా చేశాయి. ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ నియోజకవర్గంలో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తు న్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు.
కర్నూలు జిల్లా కేంద్రంలో 54 వార్డులుండగా అందులో 44 స్థానాలు వైసీపీ, 6 స్థానాలు టీడీపీ, 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. కర్నూలు జిల్లా కేంద్రంలో 44 మంది వైసీపీ కార్పొరేటర్లుండగా అందులో 23 మంది మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గీయులు కాగా మిగిలిన వారిలో కొందరు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులున్నారు. మరి కొందరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ కు అనుకూలంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత 44 మందిలో 12 మందిలో టీడీపీలో చేరారు. మరి కొందరు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇంచార్జి రేసులో ఇద్దరు నేతలు?
ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇంచార్జి మార్పు తప్పనిసరి కానుందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఓటమి తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ కు నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలంటే ఖర్చుతో కూడిన పని కావడంతో ఇంచార్జి బాధ్యతలపై ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ సెగ్మెంట్ కు నూతన ఇంచార్జిని నియమించాలనే యోచనలో పార్టీ అధిష్టానం జిల్లా బాస్ కు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా సారథి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇంచార్జి నియామకంపై దృష్టి సారించే పనిలో పడ్డారు.
అయితే ఇంచార్జి రేసులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కేడీసీసీ మాజీ చైర్ పర్సన్ విజయ మనోహరిలు ఉన్నారు. రెండ్రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ సీఎం జగన్ ను కలవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణి ఎస్వీ విజయ మనోహరికి ఇంచార్జి బాధ్యతలు ఇస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ బాధ్యతల పని జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి పెను సవాల్ గా మారింది. ఇద్దరిలో ఎవరికి ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఆసక్తిగా మారింది.